TS CM Breakfast Program: తెలంగాణ బడుల్లో సిఎం అల్పాహార పథకం ప్రారంభం
TS CM Breakfast Program: తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు ప్రారంభించారు.నియోజక వర్గానికి ఓ పాఠశాల చొప్పున 119 బడుల్లో లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
TS CM Breakfast Program: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పథకాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో వైద్య, రెవిన్యూ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ముఖ్యమంత్రి బదులుగా మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వం మానవీయ ధృక్పథంతో పనిచేస్తుందని హరీష్ రావు చెప్పారు. బంజారాహిల్స్, జూబిలీహిల్స్‌లో చదివే పిల్లలు ఎలాంటి టిఫిన్ తింటారో అలాంటి బ్రేక్‌ఫాస్ట్ ప్రభుత్వ బడుల్లో కూడా అందిస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని సిఎం ఆలోచించినట్లు చెప్పారు. ఒకటి నుంచి పది వరకు పిల్లలకు ఉదయాన్ని బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఏ సంక్షేమం అమలు చేసిన అందులో మానవీయ కోణం ఉంటుందన్నారు.
కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా తెలంగాణలో బాల్య వివాహాలు పూర్తిగా తొలగిపోయాయని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ ద్వారా 100శాతం ఆస్పత్రుల్లోనే ప్రసావాలు జరుగుతున్నాయని,తద్వారా మాత శిశు మరణాలు తగ్గించినట్టు చెప్పారు. సిఎం బ్రేక్‌ఫాస్ట్ ద్వారా డ్రాపౌట్స్ తగ్గి, పిల్లల్లో రక్తహీనత తగ్గుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుందన్నారు. 9,10 పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇస్తున్నామని, చాలా రాష్ట్రాల్లో అది లేదని తెలంగాణలో మాత్రం వారికి కూడా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను తెలంగాణ మాదిరి మరే రాష్ట్రంలో బలోపేతం చేయలేదన్నారు. వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్లు తెలంగాణలో ఉన్నాయని గుర్తు చేశారు.
తెలంగాణలో 27,140 పాఠశాలల్లో 23లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పాఠశాలల ప్రారంభానికి ప్రారంభం అరగంట ముందు అల్పాహారం అందిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్షయపాత్ర ద్వారా అల్పాహారం అందిస్తారు. మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా విద్యార్ధులకు అల్పాహారం అందిస్తారు.
అల్పాహారం మెనూను సర్కారు గురువారం అధికారికంగా విడుదల చేసింది.సీఎం అల్పాహారం పథకంలో ఉప్మా, కిచిడీ, పొంగల్‌తో పాటు ఇడ్లీ, పూరిని కూడా చేర్చారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున 119 చోట్ల పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాలలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ప్రభుత్వం ప్రకటించినా చివరి నిమిషంలో ఆయన స్థానంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై పథకాన్ని ప్రారంభించారు. మిగిలిన నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు.
పాఠశాలల్లో అల్పాహారానికి 45 నిమిషాల సమయం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పాఠశాలలు ఉదయం 8.45 గంటలకు మొదలవుతాయి. అక్కడ ఉదయం 8 గంటలకు అల్పాహారం అందజేస్తారు. జిల్లాల్లోని బడుల్లో తరగతులు ఉదయం 9.30 గంటలకు మొదలవుతాయి. ఆయా ప్రాంతాల్లో 8.45 గంటలకు అల్పాహారం ఇస్తారు.
జంట నగరాల్లో ఉదయం 8.50 నుంచి 9 వరకు, ఇతర జిల్లాల్లో ఉదయం 9.35 నుంచి 9.45 వరకు ప్రార్థన ఉంటుంది. అల్పాహారం సరఫరా ప్రారంభమయ్యే సమయానికి ఒక ఉపాధ్యాయుడైనా హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. గురుకులాల్లో రొటేషన్ పద్ధతిలో ఒకరు ఉంటారని, అదే విధానం అమలవుతుందని స్పష్టంచేస్తున్నారు.
దసరా తర్వాత అన్ని పాఠశాలల్లో అమలు..
దసరా సెలవులు ముగిసిన తర్వాత అన్ని పాఠశాలల్లో పథకం అమలవుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పథకం అమలును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు కలెక్టర్లకు అప్పగిస్తామన్నారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు పోషకాహారం ఇవ్వడానికి పథకాన్ని అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాలల్లో అల్పాహార పథకం అమలుతో 1నుంచి 10 తరగతుల్లోని 20 లక్షల మందికిపైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థుల హాజరు పెంచడం, పోషకాహారం ఇవ్వడం ద్వారా పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉండేలా చూడడం, తల్లిదండ్రులపై భారం తగ్గించడం ఈ పథకం ముఖ్యోద్దేశమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. . మొబైల్ యాప్, ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల వివరాలను సేకరిస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు అల్పాహారం నాణ్యతను తనిఖీ చేస్తారని మంత్రి సబితా తెలిపారు.