Suryapeta Politics : బీఆర్ఎస్ వర్సెస్ బీఎస్పీ...! 'సూర్యాపేట' వేదికగా ముదురుతున్న రాజకీయం
BRS vs BSP at Suryapeta: కొద్దిరోజులుగా సూర్యాపేట రాజకీయం ముదురుతోంది. వట్టే జానయ్యపై ఒకేరోజు 30కి పైగా కేసులు నమోదు కావటం, మరోవైపు ఆయన బాధితులు తెరపైకి రావటం వంటివి జరిగాయి. జానయ్య యావద్ కు బీఎస్పీ అండగా నిలవటంతో… సూర్యాపేట వేదికగా బీఆర్ఎస్ వర్సెస్ బీఎస్పీ అన్నట్లుగా మారింది.
Suryapeta Politics : సూర్యాపేట రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. డీసీఎమ్మెస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ పై ఒకే సారి పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం.. ఇందులో బెదిరింపులు.. భూకబ్జాలు.. తదితర ఆరోపణలతో ఏకంగా ఆయనకు నయా నయీం అనే పేరు కూడా ఖరారు చేశారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన జానాయ్య యాదవ్ గతంలో గాంధీనగర్ సర్పించిగా, సూర్యాపేట రూరల్ మండలం ఎంపీపీగా పనిచేశారు. ఆయన భార్య ఇపుడు అధికార బీఆర్ఎస్ నుంచి సూర్యాపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా కూడా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచే ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ గా కూడా ఉన్నారు. ఈ విషయంలో జానాయ్యకు సహకరించి పదవి ఇప్పించింది కూడా మంత్రి జగదీష్ రెడ్డి. కానీ, ఇపుడు ఈ ఇద్దరు నేతల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయినట్లే కనిపిస్తోంది.
బీసీ వాదం వినిపించడంతో...
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వట్టె జానయ్యయాదవ్ అప్పటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డికి దగ్గరి అనుచరుడు. సూర్యాపేట రూరల్ మండలంలో పట్టున్న జానయ్యను తమ వైపు తిప్పుకోక పోతే ఎన్నికల్లో నష్టం జరగుతుందని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం జానాయ్యను కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి జానయ్య మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరి కోటరీలోనే ఉన్నారు. కానీ, ఇటీవల జానయ్య బీసీ వాదాన్ని తలకెత్తుకున్నారు. టికెట్ల విషయంలోనూ బీసీ జనాభా మేరకు కేటాయింపులు ఉండాలన్న వాదన వినించారు. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్ధి సంఘాల్లో, ఉద్యమాల్లో పాల్గొన్న జానయ్య రాజకీయ చైనత్యంతో మాట్లాడుతుండడం బీఆర్ఎస్ వర్గాల్లో కొంత ఆందోళన నింపినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని జానయ్య తన దగ్గరి సహరులతో మాట్లాడడం కూడా మంత్రి ఆయనను దూరం పెట్టడానికి కారణమైందంటున్నారు.
కాంగ్రెస్ లో ఇప్పటికే సూర్యాపేట నుంచి ఆర్.దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశావహులుగా ఉన్నారు. తిరిగి ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం జానయ్యకు లేకుండా పోయింది. మరో వైపు బీజేపీలో సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు ఉండడంతో బీజేపీలోకి కూడా ఎంట్రీ లేకుండా అయిందని, ఈ కారణంగానే జానయ్య బహుజన సమాజ్ పార్టీ (బీఎస్సీ)కి దగ్గరయ్యారని చెబుతున్నారు. ఆర్ధికంగా బలపడిన జానయ్యకు యాదవ కుల సంఘాల మద్దతు బాగా ఉండడం, సూర్యాపేట నియోజకవర్గంలో యాదవుల ఓట్లు చెపుపకోదగిన స్థాయిలోనే ఉండడంతో , జానాయ్య ఒక వేళ పోటీ చేస్తే తమ పార్టీకి నష్టం జరుగుతుందన్న ముందుచూపు, అంచనాతో ఆయనను కట్టడి చేయడంలో భాగంగానే ఇబ్బడి ముబ్బడి కేసులు పెట్టారని విశ్లేషిస్తున్నారు.
తెరపైకి వట్టె జానయ్య బాధితుల సంఘం
వట్టె జానయ్య యాదవ్ కు బీఎస్పీ అండగా నిలబడింది. తమ పార్టీ తరపున ఈ సారి సూర్యాపేట నుంచి గెలిపించుకుంటామని బీఎస్సీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. జానయ్య కుటుంబాన్ని కలిసి మద్దుతగా నిలిచారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే.. తమ భూములు గుంచుకున్నాడని, కబ్జా చేశాడని, బెదరించాడని కేసుల మీద కేసులు పెట్టిన వారు జానయ్య బాధితుల సంఘం పేరున కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకోవడం, మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేయడం వంటివి చేశారు. మరో వైపు ఆయన హై కోర్టుకు వెళ్ళి.. తనపై పీడీ యాక్టు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మొర పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి అన్ని పార్టీలూ యాదవులకు సముచిత సంఖ్యలో టికెట్లివ్వాలని డిమాండ్ చేస్తున్న యాదవుల సంఘం కూడా జానయ్యకు మద్దతుగా మాట్లాడింది. జానయ్యను, ఆయన కుటుంబానికి పోలీసు కేసుల వేధింపుల వెనుక స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జగదీష్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలను యాదవ సంఘాలు, అదే మాదరిగా బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం చేస్తోంది. నిన్నటికి నిన్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సూర్యాపేట సమీపంలోని గాంధీనగర్ లోని జానయ్య కుటుంబాన్ని పరామర్శించి.. గాంధీనగర్ కాశ్మీర్ ను తలపిస్తోందని, అడుగడుగునా పోలీసులు ఆటంకాలు కలిగించారని మండిపడ్డారు.
మొత్తానికి సూర్యాపేట కేంద్రంగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలించేవిగా ఉన్నయాన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా, బీఆర్ఎస్ నాయకత్వం ఈ వ్యవహారానికి పులుస్టాప్ పెట్టేలా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అవుతోంది.