RMP Treatment: ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలుడు మృతి!, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణ
RMP Treatment: కుక్క కాటుకు గురైన బాలుడికి ఆర్‌ఎంపీ వైద్యుడు చేసిన చికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ వైద్య మండలి విచారణ చేపట్టింది.
RMP Treatment: నెల రోజుల కిందట కుక్క కాటుకు గురైన బాలుడు.. తాజాగా ఆర్ఎంపీ ఇంజక్షన్ వేసిన కొద్ది రోజులకు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆర్ఎంపీ ఇంజక్షన్ వేయడం వల్లే బాలుడు మృతి చెందాడని సోషల్ మీడియాలో వైరల్ కాగా విషయం తెలంగాణ వైద్య మండలికి చేరింది. దీంతో సుమోటాగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని ముదిగొండ గ్రామానికి చెందిన కావటి కోటేశ్వర్, సరిత దంపతులకు ముగ్గురు సంతానం. అందులో పెద్ద వాడైన కావటి మణిదీప్(10) హసన్ పర్తి మండలంలోని జ్యోతిబాపూలే గురుకుల స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్నాడు.
ఈ క్రమంలోనే కొద్ది రోజల కిందట కుక్క కాటుకు గురయ్యాడు. ఆ తరువాత వరంగల్ ఎంజీఎంలో రేబిస్ వ్యాక్సిన్ వేసుకోగా, ఈ నెల 11న మరో ఇంజక్షన్ వేయాల్సి ఉంది. కానీ కుటుంబ సభ్యులు మణిదీప్ ను అంతదూరం తీసుకెళ్లలేక మణిదీప్ ను స్థానిక ఆర్ఎంపీ అశోక్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆర్ఎంపీ అశోక్ ఇంజక్షన్ వేసి పంపించాడు.
ఇదిలాఉంటే సోమవారం ఉదయం మణిదీప్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మణిదీప్ చనిపోయినట్లు నిర్ధారించారు.
దీంతో ఆర్ఎంపీ వైద్యం వికటించడం వల్లే బాలుడు చెందినట్లు విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా సదరు ఆర్ఎంపీ, గుట్టుచప్పుడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
సుమోటాగా స్వీకరించిన తెలంగాణ వైద్య మండలి
కుక్కకాటుకు గురైన బాలుడు ఆర్ఎంపీ ఇంజక్షన్ వేయడం వల్లే అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరగగా, విషయం కాస్త తెలంగాణ వైద్య మండలి వరకు చేరింది. దీంతో టీజీఎంసీ వెంటనే స్పందించి కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ మేరకు ముదిగొండ ఘటనపై వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ బృందానికి విచారణ జరిపి నివేదిక అందించాలని టీజీఎంసీ చైర్మన్ మహేశ్ కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య సోమవారం ఆదేశించారు.
ఈ మేరకు వరంగల్ టీజీఎంసీ సభ్యుడు శేషు మాధవ్, టీజీఎంసీ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్ కుమార్, ఐఎంఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి, వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ అన్వర్ మియా, వరంగల్ హెచ్ఎర్డీఏ అధ్యక్షుడు కొలిపాక వెంకటస్వామి, థానా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాకేశ్ నేతృత్వంలోని వైద్య బృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.
దీంతో సోమవారం డాక్టర్ల బృందం ప్రాథమికంగా వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో క్షేత్రస్థాయి విచారణ జరిపి, నివేదిక మేరకు యాక్షన్ తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స వరకే పరిమితం కావాల్సి ఉండగా, వైద్యం చేస్తుండటం వల్ల తరచూ ఇలాంటి మరణాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి మరణంపై తగిన విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)