Warangal Rains : ఓరుగల్లులో భారీ వర్షాలు... ఉప్పొంగిన బొగత జలపాతం, పర్యాటకులకు నో ఎంట్రీ!
Rains in Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. మరోవైపు ములుగు జిల్లాలోని బొగతా జలపాతానికి వరద నీరు పోటెత్తింది. దీంతో పర్యాటకులను అనుమతించటం లేదు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ నయాగార పిలుచుకునే ములుగు జిల్లాలోని బొగత జలపాతానికి వరద నీరు పోటెత్తింది. ములుగు జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పైనుంచి వచ్చే వరదతో జలపాతం ఉప్పొంగుతోంది. చూపరులకు కనుల విందు చేస్తోంది.
దీంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు బొగత సందర్శనకు వస్తుండగా, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బోగత జలపాతం వద్ద నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు నిరాశతో వెనుదిరుగుతుండగా, ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని అక్కడి అధికారులు కోరుతున్నారు.
పర్యాటకులకు నో ఎంట్రీ…
బోగత వాటర్ ఫాల్స్ కు ఎగువన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ములుగు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీరు కాస్త బోగతకు పోటెత్తుతుండటంతో జలపాతం వద్ద ఉధృతి పెరుగుతోంది. ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుండటంతో అధికారులు బోగత సందర్శనను నిలిపి వేశారు. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం, దాంతో జలపాతానికి మరింత వరద చేరే ఛాన్స్ ఉండంతో అటవీ, పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వరద పోటెత్తడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని అటవీశాఖ సిబ్బంది, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ మేరకు వరద, లోతట్టు ప్రాంతాలకు ప్రజలు ఎవరూ వెళ్లకూడదని ములుగు జిల్లా వాజేడు పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పర్యాటకులకు వర్షాలు తగ్గేంత వరకు బోగత వద్దకు ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
ఓపెన్ కాస్ట్ లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి కేటికే-2, కేటీకే -3 ఓపెన్ కాస్ట్ లో గనులోకి వరద నీరు చేరి 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దీంతో సింగరేణికి సుమారు రెండు కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో వరద నీరు చేరడంతో 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగిగింది.
రాకపోకలకు అంతరాయం
భారీ వర్షాల వల్ల కాటారం–మేడారం రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేశవాపూర్–-పెగడపల్లి మధ్య ఉన్న పెద్దవాగు, బొర్రవాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలాఉంటే మహదేవపూర్ మండలం చండ్రుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అన్నారం చండ్రుపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా కాటారం మండలంలో వాగులో ఓ బొలెరో వాహనం కొట్టుకుపోయింది. గంగాపురి–మల్లారం గ్రామాల మధ్య కాజ్ వే పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా, బొలెరో వాహనం కొట్టుకుపోగా, అందులో ఉన్న డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి వరంగల్ లోని ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో శుక్రవారం అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక శనివారం కూడా భారీ వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు శనివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి).
సంబంధిత కథనం