Telangana Rains: నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, తెలంగాణల నేడు, రేపు భారీ వర్షాలు, పోటెత్తుతున్న గోదావరి
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలో పెద్దవాగుకు గండి పడింది. దీంతో ఏపీ, తెలంగాణల్లో పలు గ్రామాలు నీటమునిగాయి. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం కావడంతో వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాఫ్టర్లలో రక్షించారు.
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగుకు గండిపడటంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దవాగు గరిష్ట స్థాయికి చేరినా గేట్లను తెరవలేకపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహించాల్సిన క్రస్ట్ గేట్లు నిర్వహణ లేకపోవడంతో వాగుకు గండిపడింది.
దీంతో పోలవరం, అశ్వారావు పేట నియోజకవర్గాల్లోని పలు ఏజెన్సీ గ్రామాలు నీట మునిగాయి. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం కూడా తెలంగాణలో నాలుగు జిల్లాల్లో, శనివారం ఆరు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హైదరాబాద్ ప్రకటించింది.
జూలై 20వ తేదీ శనివారం ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు వర్షం కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో మరో ఐదారు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది.
వాగులో చిక్కుకున్న వారిని హెలికాఫ్టర్లలో తరలింపు…
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో దిగువ భాగంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది. పెద్దవాగుకు గండి పడటంతో దిగువున ఉన్న గ్రామాల్లో వరద ప్రవాహం పెరిగిపోయింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని నారాయణపురం వద్ద పెద్ద సంఖ్యలో వరద ప్రవాహంలో చిక్కుకోవడంతో వారిని హెలికాఫ్టర్లలో రక్షించారు. పోలవరం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సహాయ చర్యల్ని పర్యవేక్షించారు.
వరదలు ముంచెత్తిన సమాచారం తెలియడంతో మంత్రి తుమ్మల సిఎంఓకు సమాచారం అందించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీమ్‌లతో కలిసి సహాయ చర్యలు చేపట్టాయి. గురువారం తెలంగాణలో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
నిర్వహణ లోపంతో పెద్దవాగుకు గండి…
పెద్దవాగు గండి పూడ్చడానికి కనీసం రూ.20కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న ప్రాజెక్టును గత కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో గురువారం గండిపడినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టే పెద్దవాగు... భద్రాద్రి జిల్లాలో ప్రవహించి తిరిగి ఏపీలోకి వెళుతుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లిలో పెద్ద వాగుపై 1977-78లో మినీ జలాశయాన్ని నిర్మించారు. అర టిఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో ఖమ్మంలో 3వేలఎకరాలు, ఏపీలోని వేలేరుపాడు, కుక్కనూరు మండలాలకు నీరు అందుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్వహణ అటెక్కింది. గేట్లు పనిచేయకపోవడం, ఇటీవల వరదలకు నీటి ప్రవాహం పెరిగినా సకాలంలో వాటిని ఎత్తకపోవడంతో గురువారం గండి పడినట్టు చెబుతున్నారు.