BJP BC Declaration: ‘బీసీలకు పెద్ద పీట వేస్తాం’... డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ-bjp telangana announced bc declaration ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bjp Telangana Announced Bc Declaration

BJP BC Declaration: ‘బీసీలకు పెద్ద పీట వేస్తాం’... డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ

HT Telugu Desk HT Telugu
May 18, 2023 04:14 PM IST

BJP Telangana BC Declaration:బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది బీజేపీ తెలంగాణ నాయకత్వం. బీజేపీ అధికారంలోకి వస్తే... బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని...

బీజేపీ తెలంగాణ బీసీ డిక్లరేషన్
బీజేపీ తెలంగాణ బీసీ డిక్లరేషన్

BJP Telangana Latest News: బీజేపీ తెలంగాణ.. బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్చురేషన్ పద్దతిలో అందరికీ ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తామని, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఈరోజు హైదరాబాద్ లోని నాగోల్ లో జరిగిన బీజేపీ తెలంగాణ ఓబీసీ సమ్మేళనం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సహా బీసీ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ బీసీ డిక్లరేషన్ ను ప్రవేశపెట్ట్టగా బండి సంజయ్ ఆమోదించారు.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్యాంశాలు...

-రాష్ట్రంలోని బీసీ కమిషన్ కోరల్లేని కమిషన్... బీసీ జాబితాలో చేర్చే అధికారం లేదు.. బీజేపీ అధికారంలోకి వస్తే... రాష్ట్రంలోని బీసీ కమిషన్ ను రాజ్యాంగ హోదా కల్పిస్తాం. బీసీ సబ్ ప్లాన్ ను అమలు చేసి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తాం. విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు స్టాచ్యురేషన్ ప్రాతిపదికన ఆర్దిక సాయం చేస్తాం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తాం. ఎన్నికల్లో గెలిచి రాలేని బీసీ కులాలకు ప్రాధాన్యతనిస్తాం.

- రాబోయే ఎన్నికల్లో బీసీల ఎజెండాగా చేసుకుని బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.... బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్సే.

- స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధానిగా చేసిన జవహార్ లాల్ నెహ్రూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే... బీసీల విషయంలో మాత్రం కమిషన్ వేసి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని అంబేద్కర్ చెప్పినా నెహ్రూ వినలేదు. బీసీ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన నెహ్రూకు నిరసనగా... అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు దిగొచ్చి కాకా కళేకర్ కమిషన్ ను నియమించింది. రెండేళ్ల తరువాత నివేదిక ఇచ్చింది. అందులో 2399 బీసీ కులాల్లో 8 వందలకుపైగా కులాలు అత్యంత వెనుకబడ్డాయని నివేదించింది. కానీ నెహ్రూ కనీసం ఆ నివేదికను బుట్టదాఖలు చేసి బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబించారు. అంతేగాకుండా ఆర్దిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలే తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని... ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే... దేశ విభజనకు దారితీసే ప్రమాదం ఉందని తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ అన్న రాష్ట్రాలకు లేఖ రాశారు (ఇదిగో లేఖ అంటూ చూపించారు. బీసీలారా.... కాంగ్రెస్ ను నిలదీయండి. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలి. కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఓబీసీ మోర్చా సమ్మేళం నిర్వహిస్తున్నాం.

•బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన పార్టీ బీజేపీ. ఛాయ్ అమ్ముకునే పేద కుటుంబానికి చెందిన బీసీ వ్యక్తి నరేంద్రమోదీని ప్రధానిగా చేసిన చరిత్ర బీజేపీదే. బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయడంతోపాటు అగ్ర కులాల్లోని పేదలకు సైతం రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత మోదీదే. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా పార్లమెంట్ సాక్షిగా ఓబీసీ జాతీయ కమిషన్ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్, కమ్యూనిస్టులు అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా వెనుకాడకుండా ఆ బిల్లును ఆమోదింపజేసిన ఘనత నరేంద్రమోదీదే.

•గతంలో కేంద్ర సంస్థల్లో 2018 నుండి బీసీలకు 21 శాతం మేరకు విద్యలో అడ్మిషన్లు దక్కుతున్నాయి. గతంలో 14 శాతమే అమలు చేశారు.. ఏ సమాజికవర్గ జాబితాను బీసీలో చేర్చాలనే అంశంపై రాష్ట్రాలకే అధికారాన్ని అప్పగిస్తూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన ఘనత మోదీదే. ఆ స్వేచ్ఛను బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా దుర్వినియోగం చేస్తోంది. ఉత్తరాద్రకు చెందిన 26 బీసీ కులాల ప్రజలు తెలంగాణలో స్థిరపడితే... ఒక్క కలం పోటుతో జీవో జారీ చేసి బీసీ జాబితా నుండి తొలగించిన ద్రోహి కేసీఆర్. బీసీ క్రీమిలేయర్ 6 నుండి 8 లక్షలకు పెంచింది. దీనిని 15 లక్షల వరకు పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోంది. కేంద్ర కేబినెట్ లో 27 మంది ఓబీసీలకు, 12 మంది ఎస్సీ, 8 మంది ఎస్టీ, 5 శాతం మైనారిటీలకు కేబినెట్ లో చోటు కల్పించిన ఘనత మోదీదే.

•మన రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుటుంబానికి మాత్రమే సామాజిక న్యాయం జరుగుతోంది. 54 శాతం బీసీలంటే అందులో ముగ్గురికి మాత్రమే కేసీఆర్ మంత్రి పదవులిచ్చారు. కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులిచ్చారు. కేసీఆర్ కు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించేందుకే ఓబీసీ సమ్మేళనం. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా 15 వందల మందికి ఎంబీబీఎస్ చదివే అవకాశం దక్కింది. మత్స్యశాఖకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను కేటాయించి రూ.20 వేల కోట్లను కేటాయించిన ఘనత మోదీదే.. స్కిల్ డెవలెప్ మెంట్ స్కీం కింద లక్షలాది మంది బీసీలకు సాయం చేస్తున్నారు.

•దేశంలో 40 సెంట్రల్ వర్శిటీలుంటే... మోదీ హయానికి ముందు గత 70 ఏళ్లుగా పట్టుమని పది మంది కూడా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా లేరంటే.... బీసీలను ఎంతగా అణగదొక్కారో అర్ధమవుతోంది. దీనిపై మోదీని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావిస్తే... వివరాలు తెప్పించుకున్న ప్రధానమంత్రి 9 వేల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. తద్వారా అందులో 4 వేల మంది బీసీలు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించపడ్డారు.

•ప్రధానమంత్రి వికాస్ పేరిట విశ్వకర్మలను ఆదుకునేందుకు 140 జాతులకు నైపుణ్య శిక్షణనిచ్చి ఎదిగేందుకు కృషి చేస్తున్నరు. సంచార జాతుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి విద్య, ఉపాధి కల్పించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులను మోదీ చేశారు. అందులకే మూడో సారి ప్రధాని కాబోతున్నారు. ఇది సహించలేక కాంగ్రెస్ నాయకులు మోదీని కులం, జాతి పేరుతో అవమానిస్తున్నారు. చూస్తూ ఊరుకుందామా? రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పేదాకా డిమాండ్ చేద్దాం.... ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెబుదాం.

•లోక్ సభలో 113 మంది బీసీకి చెందిన బీజేపీ ఎంపీలున్నారు. అత్యధిక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీలోనే ఉన్నారు. కుటంబ సమగ్ర సర్వే చేసినా బీసీ జనాభా 52 శాతం ఉందని తేలినా వాళ్లకు ఒరగబెట్టిందేమీలేదు. కుల వ్రుత్తులను ధ్వంసం చేస్తున్నారు. బీసీ ఫెడరేషన్ కు నిధులే లేవు. బీసీల పేరుతో అధికారంలోకి వచ్చి కేసీఆర్ కుటుంబం కోసం పాటుపడుతున్నారే తప్ప బీసీలకు చేసిందేమీ లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తెలంగాణలో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన కేసీఆర్ ఫ్రభుత్వం అందుకు విరుద్ధంగా 23 శాతానికి కుదించి బీసీలు ప్రజా ప్రతినిధుల కాకుండా అన్యాయం చేశారు. కేసీఆర్ బీసీ ద్రోహి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

•ముస్లింలలో ఉన్న బీసీలకు మేం వ్యతిరేకం కాదు.. కానీ బీసీల పేరుతో బీసీ రిజర్వేషన్లు కాజేస్తూ... జీహెచ్ఎంసీలో 50 బీసీ సీట్లలో 32 మంది ఎంఐఎం తన్నుకుపోతే... కేసీఆర్ ఫ్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తున్నట్లు? దారుస్సలాంకు కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారు. పైగా మత ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మేం వ్యతిరేకం.

•ఎంబీసీల పేరుతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి రూ.2500 కోట్లు కేటాయించినా... ఖర్చు చేసింది మాత్రమే రూ.7 కోట్లే... అయినా బీసీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు బానిసలుగా ఉన్నారు? హిందూ బీసీలుగా పుట్టడమే పాపమా? బీసీ డిక్లరేషన్ ను తొక్కిపెట్టిన మహానుభావుడు కేసీఆర్. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే... జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీలకు అన్నింట్లో వాటా ఇస్తాం. ఈ మేరకు తెలంగాణ డిక్లరేషన్ ను ప్రవేశపెట్టబోతున్నాం.

•40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్పించి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నా... తొలగించిన 26 ఉత్తరాంధ్ర కులాలను సైతం మళ్లీ బీసీ జాబితాలో చేర్చించి న్యాయం చేస్తాం. ప్రధానమంత్రితో చర్చంచి రిజర్వేషన్లు పొందని బీసీలోని చిన్న కులాలకు సైతం న్యాయం చేస్తాం. కేంద్రంలో బీసీ వర్గీకరణ చేపడతాం.

•బీసీ జన గణన గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ పని చేయలేదు. సిగ్గు లేకుండా ఎన్నికలొస్తే బీజేపీ గణన చేస్తామని మోసం చేస్తున్నారు. తప్పుడు అంకెల గారడీ చేస్తున్నారు. చిదంబరం కొడుకు కార్తీక్ చిదంబరం బీసీ గణనను బాహాటంగా వ్యతిరేకించారు. వీళ్లా బీజేపీకి చెప్పేది? బీసీ గణన ‌నివేదికను విడుదల చేయకుండా తొక్కిపెట్టిన ఘనత కాంగ్రెస్ దే.

•బీసీ గణనపై కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది? వాటిని ఎందుకు బయటపెట్టలేదు. ఆ వివరాలన్నీ బయటకు వస్తే బీసీలకు పదవులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే తొక్కిపెడుతున్నారు. అయినా సిగ్గు లేకుండా కేంద్రం బీసీ గణన చేయాలంటూ తీర్మానం చేయడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. బీసీ గణనపై అధ్యయనం చేసి శాస్త్రీయంగా నిర్వహించాలన్నదే బీజేపీ విధానం. బీసీ గణన నిర్వహించే అధికారం రాష్ట్రాలకు కేంద్రం అప్పగించింది. అయినా కేసీఆర్ ఎందుకు నిర్వహించడం లేదు?

- తెలంగాణలో బీసీలను కేసీఆర్ అణగదొక్కుతున్నారు. మోదీ ప్రభుత్వం బీసీలకు పెద్ద పీట వేస్తోంది. అందుకే తెలంగాణలో మార్పు రావాలి. బీసీల మద్దతు కూడగట్టుకుని తెలంగాణలో అధికారంలోకి వస్తాం. అందుకోసం 130 కులాలను ఏకం చేస్తాం... పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ పేరుతో ఈ విషయాలన్నీ ప్రచారం చేస్తాం... అతి త్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బీసీ దోషిగా నిలబెడతాం.

IPL_Entry_Point