Cyber crime gang arrested : తెలంగాణ పోలీసుల విజయం… సైబర్ నేరాల ముఠా అరెస్ట్-big cyber crime gang arrested by telangana police ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Big Cyber Crime Gang Arrested By Telangana Police

Cyber crime gang arrested : తెలంగాణ పోలీసుల విజయం… సైబర్ నేరాల ముఠా అరెస్ట్

B.S.Chandra HT Telugu
Aug 29, 2022 11:45 AM IST

Cyber crime gang arrested : తెలంగాణ పోలీసులు ఓ కొత్త రికార్డు సృష్టించారు. సైబర్ నేరాలతో జనం ఖాతాల నుంచి నగదు కొట్టేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. జనం నుంచి వసూలు చేసిన కోట్ల రుపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో ఈ స్థాయిలో సైబర్‌ క్రైమ్ నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి…

ట్రేడింగ్‌ పేరుతో లూటీ, భారీ ముఠాను పట్టుకున్న టీ పోలీసులు
ట్రేడింగ్‌ పేరుతో లూటీ, భారీ ముఠాను పట్టుకున్న టీ పోలీసులు (HT_PRINT)

Cyber crime gang arrested : సైబరాబాద్ పోలీసులు ఓ భారీ సైబర్ క్రైమ్‌ ముఠా గుట్టు రట్టు చేశారు. నెలల తరబడి సాగించిన దర్యాప్తులో జనం సొమ్ము కొట్టేసిన భారీ ముఠాను వలపన్ని పట్టేశారు. మార్కెట్ బాక్స్ పేరిట ఆన్‌లైన్ ట్రేడింగ్‌ యాప్‌ను వినియోగించి బాధితుల నుంచి లక్షల్లో సొమ్ము కొట్టేశారు. ఇలా జనం నుంచి కొట్టేసిన డబ్బును బ్యాంకుల నుంచి డ్రా చేసి సూట్‌కేసుల్లో దాచిపెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు వేల మంది నుంచి ఈ ముఠా డబ్బులు కాజేశారు.

ట్రెండింగ్ వార్తలు

సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర సైబర్ క్రైం ముఠా నేరాలను వివరించారు. దేశంలో సైబర్ నేరాలలో పోలీసులు స్వాధీనం చేసుకున్న అతిపెద్ద కేసు ఇదేనని చెప్పారు. మొబైల్‌ యాప్‌లో 3వేల మందికి పైగా రిజిస్టర్ అయ్యారు. నిజానికి ఈ యాప్‌లో కనిపించేది మొత్తం ఫేక్ సమాచారమేనని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు అంతా రాజస్థాన్‌లో వ్యాపారులుగా చెలామణి అవుతున్నారు. పెద్దపెద్ద వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో వీరిపై మొదటి ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత డబ్బులు పోగొట్టుకున్న బాధితులు సైబ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో మూడు నెలల పాటు రాజస్థాన్‌లో అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించి వీరిని గుర్తించారు. నిందితులు పలు ప్రాంతాల్లో కాల్‌ సెంటర్లను నిర్వహించి జనాన్ని మోసం చేసేవారు.

మార్కెట్ బాక్స్‌ ట్రేడింగ్ యాప్‌ ను వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌లలో ఎక్కువగా షేర్ చేసేవారు. అమాయకులు ఈ యాప్‌ను ఏపికే ద్వారా ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకునే వారు. ఆ తర్వాత వారికి ఆన్‌లైన్ ట్రేడింగ్‌ పేరుతో డబ్బులు కాజేసేవారు. ఇలా మూడు వేల మందిని మోసం చేసి పదికోట్లకు పైగా కాజేశారు. వీరిలో నలుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 9.8కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్‌లో నగదు స్వాధీనంగా చెబుతున్నారు.

గత ఏడాది డిసెంబర్‌ 14న సైబరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.62లక్షలు ట్రేడింగ్‌ యాప్‌లో పెట్టుబడి పెట్టారు. అందులో రూ.34.7 లక్షల నష్టం వాటిల్లిందని, నష్టాలకు కారణాలపై మార్కెట్ బాక్స్‌ నిర్వాహకులు సరిగ్గా స్పందించకపోవడంతో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ యాప్‌లో ఉన్న సమాచారం మొత్తం అబద్దమేనని గుర్తించారు. ట్రేడింగ్‌లో అమాయకులు లక్ష్యంగా ట్రేడింగ్‌ చేసేలా దానిని తయారు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై 521/2021 ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నిందితులపై 420 ,ఐటీ యాక్ట్‌ ప్రకారం కేసులు పెట్టారు. ఆ తర్వాత నిందితులు ఎక్కడి ఆపరేట్‌ చేస్తున్నారో గుర్తించారు.

ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్‌ చేశారు. అభిషేక్ జైన్‌ అనే కమోడిటీ ట్రేడర్‌ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. యూపీలోని చందోలి జిల్లా మొగుల్ సరాయ్‌ ప్రాంతం నుంచి వీరు నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వాట్సాప్, టెలిగ్రాం గ్రూపులలో యాప్‌ను పంపి ప్రచారం చేవారు. నిందితులపై మూడు నెలల పాటు నిఘా వేసి నిందితుల నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

WhatsApp channel