Bathukamma 2024 : పూల పండగకు వేళాయే..! తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ వేడుకలు-bathukamma celebrations 2024 in telangana from today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bathukamma 2024 : పూల పండగకు వేళాయే..! తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ వేడుకలు

Bathukamma 2024 : పూల పండగకు వేళాయే..! తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ వేడుకలు

HT Telugu Desk HT Telugu
Oct 02, 2024 10:46 AM IST

ప్రకృతిని ఆరాదిస్తు అత్యంత వైభవంగా జరుపుకునే పూలపండుగ బతుకమ్మ సంబరాలకు తెలంగాణ వేదికయ్యింది. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో పూల పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించే పనిలో మహిళలు నిమగ్నమయ్యారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆడిపాడేందుకు మహిళలంతా సిద్దమయ్యారు.

తెలంగాణ బతుకమ్మ పండగ (ఫైల్ ఫొటో)
తెలంగాణ బతుకమ్మ పండగ (ఫైల్ ఫొటో)

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతకమ్మ పండుగకు సర్వం సిద్ధమయింది. ఆశ్వీయుజ శుద్ద అమవాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజులపాటు సంబరంగా వేడుకలు జరుగుతాయి. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

9 రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబరాల్లో మునిగితేలుతారు. ఊరు వాడ చిన్నా పెద్ద తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా మహిళలు తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చుతారు. సాయంకాలం ప్రధాన కూడళ్ళకు బతుకమ్మలను తీసుకెళ్ళి వాటి చుట్టూ లయబద్దంగా తిరుగుతూ ఆడిపాడిపాడుతారు.

రోజుకో పేరుతో బతుకమ్మ వేడుకలు…

తొమ్మిది రోజుల పాటు మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ వేడుకలను రోజుకో పేరుతో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సంబరాలు నిర్వహిస్తారు. రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తారు.

తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మనాడు తీరొక్క పూలతో నిలువెత్తు బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమ తో గౌరమ్మను తయారు చేసి పూజలు నిర్వహిస్తారు.

సాయంత్రం ఆటపాటలతో గౌరీ దేవిని కొలిచి చివరకు బతుకమ్మలను పారేనీళ్ళలో నిమజ్జనం చేస్తారు. పసుపు కుంకుమలతో ముత్తయిదు మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. పిండి వంటలను ప్రసాదంగా స్వీకరిస్తారు.

ప్రకృతి పండుగ…

పూలు వికసించే కాలంలో, జలాశయాల్లోకి సమృధ్ధిగా నీళ్ళు చేరి పొంగిపొర్లే సమయంలో బతుకమ్మ పండుగ వస్తుంది. భూమి, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది బతుకమ్మ పండుగ. అలాంటి పండుగ వచ్చిందంటే చాలు వారం పది రోజుల ముందు నుంచే మహిళలంతా పండుగ పనిలో నిమగ్నమవుతారు.

కొత్తబట్టలు, తీరొక్క పూలు, మేకప్ కిట్లు, బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీంతో మార్కెట్ అంతా సందడిగా మారుతుంది. బతుకమ్మ పండుగ పై పురాణ కథలు ఎన్నో ఉన్నా, బతుకునిచ్చే బతుకమ్మ వేడుక తమకు అతి పెద్ద పండుగ అని మహిళలు అభిప్రాయాపడుతున్నారు. ప్రకృతిని ఆరాధించే పండుగగా భావిస్తారు.

పల్లె పట్నం సర్వం సిద్ధం…

పుడమి తల్లికి నీరాజనాలు సమర్పించినట్లు జరుపుకునే బతుకమ్మ సంబరాలకు ఊరు వాడ పల్లే పట్నం అంతా సిద్ధమైంది. ఈసారి విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలతో కళకళలాడుతుండడంతో కన్నుల పండువలా బతుకమ్మ వేడుకలు నిర్వహించే పనిలో మహిళలు నిమగ్నమయ్యారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగైదు రోజులుగా విద్యాసంస్థల్లో బతుకమ్మ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈరోజు నుంచి ప్రతి పల్లెలో ప్రతి వాడలో బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓవైపు బతుకమ్మ సంబరాలు, మరోవైపు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో తెలంగాణ పల్లెలన్నీ పండుగ వాతావరణంతో కలలాడుతున్నాయి.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం