Bandi Sanjay and Kishan Reddy: కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్, కిషన్‌ రెడ్డి-bandi sanjay and kishan reddy took charge as union ministers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay And Kishan Reddy: కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్, కిషన్‌ రెడ్డి

Bandi Sanjay and Kishan Reddy: కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్, కిషన్‌ రెడ్డి

Sarath chandra.B HT Telugu

Bandi Sanjay and Kishan Reddy: కేంద్రంలో మోదీ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలోమంత్రులుగా నియమితులైన బండి సంజయ్, కిషన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్

Bandi Sanjay and Kishan Reddy: మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. "హోం" స‍‍హాయ మంత్రిగా బాధ్యతలను సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు.

గురువారం ఉదయం 11 గంటలకు నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలను చేపట్టారు. పదవీ బాధ్యతల కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ హాజరై వేద మంత్రోచ్చరణలతో బండి సంజయ్ కు ఆశీస్సులు అందించారు.

బండి సంజయ్‌కు పూలబొకే అందించి సహచర మంత్రి నిత్యానంద రాయ్ అభినందనలు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు చేపట్టారు.

అంతకు ముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పూలబొకేలు, శాలువాతో సత్కరించి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజల రాకతో బండి సంజయ్ నివాసం కోలాహలంగా మారింది.

బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్‌ రెడ్డి….

మోదీ 3.0 సర్కారులో కిషన్‌ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణతో పాటు రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేని ప్రపంచాన్ని నరేంద్ర మోదీ సృష్టించారని దానిని మరింత ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. పవర్, కోల్‌, రైల్వే, మైన్స్‌, పర్యావరణ శాఖలకు అవినాభావ సంబంధం ఉందని, వాటి మధ్య సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు. నరేంద్రమోదీ, దేశ ప్రజల అకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. బొగ్గు శాఖను ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేస్తానన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు రెండు శాఖల బాధ్యతలు ఇచ్చారని,  బొగ్గు, మైనింగ్​ శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నట్టు తెలపారు.  ఇప్పటి వరకు ప్రహ్లాద్​ జోషి, అంతకు ముందు పీయూష్​ గోయల్​ ప్రధాని మోదీ ఆశీర్వాదంతో ఈ శాఖలో పనిచేశారని ఆ శాఖను మోదీ అకాంక్షలకు అనుగుణంగా నడుపుతానన్నారు. ప్రజల జీవితాల్లో విద్యుత్​ రంగం కీలకంగా ఉందని  పదేళ్ల క్రితం దేశంలో తీవ్ర విద్యుత్​ కొరత ఉండేది. హైదరాబాద్​ లో పారిశ్రామికవేత్తలు సమ్మె చేసిన ఘటనలు మనం చూశామన్నారు.

దేశంలో, తెలంగాణలో  కరెంట్​, నీళ్ల కొరత ఉండేది. పంటలు ఎండిపోయేవి. అన్ని రాష్ట్రాల్లో గత పదేండ్లలో ప్రధాని మోదీ విద్యుత్​ కొరతకు చెక్​ పెట్టారన్నారు.  ప్రధాని మోదీ నాయకత్వంలో గత పదేండ్ల నుంచి వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహాలకు సరిపోను కరేంట్​ వస్తున్నది. దానికి ప్రధానమైన కారణం.. బొగ్గు ఉత్పత్తి అన్నారు.దీ ని ద్వారానే ఈరోజు ఎక్కువ శాతం విద్యుత్​ ఉత్పత్తి జరుగుతుందన్నారు.

రానున్న రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాం. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి మనం కొంత దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మన అవసరాలకు సరిపోయెలా బొగ్గు ఉత్పత్తిని పెంచుతామన్నారు.  దేశంలో ఉన్న ఖనిజాలను బయటకు తీయడం.. ఉపాధి అవకాశాలను పెంచడం, భారత్​ ఖనిజాలను ఇతరదేశాలకు ఎగుమతి చేసి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామన్నారు. 

దేశ ప్రజల ఆకాంక్షల మేరకు, మోదీ సంకల్ప్​ పత్రంలో పేర్కొన్నట్టుగా ఈ ఐదేండ్లు పూర్తి స్థాయిలో నాకు అప్పగించిన శాఖల బాధ్యతలను నెరవేరుస్తాననని చెప్పారు. శక్తివంతమైన భారత్​ ను రూపొందించడంలో బొగ్గు, మైనింగ్​ శాఖల పాత్ర కీలకం. దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తాననని  ఈ శాఖల్లో చాలా సీనియర్​, ఉత్తమ అధికారులు ఉన్నారని,  వారందరితో కలిసి టీమ్​ వర్క్​ తో పనిచేసి భారత్​ ను అగ్రపథంలో నడిపించేందుకు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో పనిచేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు.