Sangareddy News : 45 రోజుల బాలుడు.... చనిపోయిన 10 రోజుల తర్వాత పోస్ట్ మార్టమ్ - కారణమిదే
చనిపోయిన 10 రోజుల తర్వాత ఓ బాలుడి శవాన్ని బయటికి వెలికి తీశారు. అనారోగ్యానికి గురైన బాలుడికి చికిత్స అందించిన ఓ ప్రైవేటు ఆస్పత్రిపై సంగారెడ్డి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. పోస్టుమార్టమ్ నివేదికను ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.
ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు తమ కుమారునికి సరైన చికిత్స అందించకపోవడంతోనే మృతి చెందాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో 10 రోజుల క్రితం అంత్యక్రియలు నిర్వహించిన అబ్బాయి శవాన్ని మళ్లీ వెలికి తీసి పోస్టమార్టమ్ నిర్వహించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు శవ పరీక్ష చేశారు.
ఈ పోస్టుమార్టం రిపోర్ట్స్ ను హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత … తుది నివేదిక ఆధారంగా ఆసుపత్రి యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ ఫర్హీనా షేక్ వెల్లడించారు.
ఏం జరిగిందంటే…?
వివరాల్లోకి వెళ్తే హత్నూర్ మండలంలోని కొన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెట్టి ప్రభులింగం (26), అనురాధ (21) దంపతుల తొలిసారి కాన్పులో కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి దశ్విక్ ( 45 రోజులు) అని పేరు పెట్టుకున్నారు. ఉన్నట్టుండి.. ఆ బాలుడు సెప్టెంబర్ 5 న అనారోగ్యానికి గురయ్యాడు. ఆ రాత్రి సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల శిశురక్ష పిల్లల ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో బాబుని పరీక్షించి, వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగ్యూ జ్వరం వలన ప్లేట్లెట్స్ తగ్గాయని వారికీ తెలిపారు. దీంతో మూడు రోజులు బాలుడికి చికిత్స అందించారు.
ఈ సమయంలో తల్లితండ్రులను కూడా బాబుని చూడనివ్వలేదు. అనంతరం 8 వ తారీకు మధ్యాహ్నం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని నిలోఫర్ ఆసుపత్రికి అంబులెన్సులో వారే తరలించారు. అప్పుడు కూడా తల్లితండ్రులను పట్టుకోనివ్వకుండా ఆసుపత్రికి సంబందించిన ఒక అటెండెంట్ ను పంపించారు.
నీలోఫర్ కి వెళ్లిన తల్లితండ్రులకు.. బాబు శ్వాస తీసుకోవటం లేదని అక్కడి వైద్యులు చెప్పారు,. సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మళ్లీ పరీక్షించిన వైద్యులు బాబు చనిపోయి చాలా సమయం అయ్యిందని తల్లితండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బాలుడి ఆరోగ్య స్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సంగారెడ్డిలోని ఆస్పత్రి యాజమాన్యం నిలోఫర్ ఆసుపత్రికి తరలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు రాత్రి కావడంతో… సెప్టెంబర్ 9 న బాబుకు ప్రభులింగం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
సెప్టెంబర్ 10న కొన్యాల గ్రామంలో డెంగ్యూ తో పసి బాలుడు మృతి చెందిన వార్త పలు దినపత్రికల్లో వచ్చింది. దీనిని గమనించి డిప్యూటీ డీఎంహెచ్ ఓ సునంద గ్రామానికి చేరుకొని కుటుంబసభ్యులను అడిగి వివరాల సేకరించారు. ఆసుపత్రిలో ఇచ్చిన రిపోర్ట్ లను ఆమె పరిశీలించారు.
పోలీసులకు ఫిర్యాదు…
డెంగ్యూ నిర్ధారణకు చేయాల్సిన ఎలిసా టెస్ట్ చేయకుండానే డెంగ్యూ జ్వరం అని నిర్ధారించి పసి బాలుడి చికిత్సనందించారని ఆమె తెలిపారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిణి గాయత్రీ దేవి… శిశు రక్ష ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ ని సీజ్ చేసారు. తమ బిడ్డ మృతికి శిశురక్ష ఆసుపత్రి వైద్యులే కారణమంటూ తల్లితండ్రులు ప్రభులింగం, అనురాధ దంపతులు సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటంతో డాక్టర్లు బాబు శవానికి పోస్టుమార్టం చేయాలనీ నిర్దారించారు.
ఈ మేరకు గురువారం బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. తహసిల్దార్ ఫర్హీనా షేక్, సంగారెడ్డి పట్టణ ఎస్సై నర్సింలు, ఆర్ ఐ శ్రీనివాస్, దశ్విక్ తల్లితండ్రులు, గ్రామా పెద్దల సమక్షంలో బయటికి తీశారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల చెందిన డాక్టర్లు వేణుగోపాలరావు, దీపక్ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పోస్టుమార్టం రిపోర్ట్స్ ను హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆసుపత్రి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ ఫర్హీనా షేక్ తెలిపారు.