Khammam Poachers: ఖమ్మం జిల్లాలో వన్య ప్రాణుల వేటగాళ్ల అరెస్ట్.. నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం-arrest of wild animal poachers in khammam district accused may get seven years imprisonment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Poachers: ఖమ్మం జిల్లాలో వన్య ప్రాణుల వేటగాళ్ల అరెస్ట్.. నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం

Khammam Poachers: ఖమ్మం జిల్లాలో వన్య ప్రాణుల వేటగాళ్ల అరెస్ట్.. నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం

HT Telugu Desk HT Telugu
Apr 08, 2024 09:07 AM IST

Khammam Poachers: వన్య ప్రాణుల్ని వేటాడుతున్న ముఠాను ఖమ్మం జిల్లాలో అటవీశాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులకు ఏడేళ్ల జైలు పడొచ్చని వివరించారు.

ఖమ్మంలో వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్..
ఖమ్మంలో వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్..

Khammam Poachers: అడవి జంతువులకు ఉచ్చు బిగించి వేటాడుతున్న Poachers ఒక ముఠాకు ఫారెస్టు అధికారులు ఉచ్చు బిగించి పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున భద్రాద్రి కొత్తగూడెం Bhadradri Kothagudem జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాలు ఉండటంతో వేటగాళ్ళు ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్న జంతువులను మాటు వేసి హతమారుస్తున్నారు.

yearly horoscope entry point

ఖమ్మం జిల్లాలో అధిక భాగం ఏజెన్సీ కావడంతో అడవి జంతువుల సంచారం ఇక్కడ బాగా ఉంటుంది. ఇలా జంతువులను వేటాడుతున్న ఒక ముఠాను ఆదివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా తల్లాడలో జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ సంబంధిత వివరాలను వెల్లడించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు అటవి జంతువులను వేటాడుతుండగా కొంతమంది వేటగాళ్ళను కాపు కాసి పట్టుకున్నట్లు Khammam జిల్లా ఫారెస్ట్ అధికారి DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. తల్లాడ రేంజర్ పరిధి చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు బీటు పరిధిలోని అటవీ ప్రాంతంలో రాత్రివేళ కొంతమంది వేటగాళ్లు జంతువులను వేటాడుతుండగా పట్టుబడ్డారని వివరించారు.

ఉన్నతాధికారుల విశ్వసనీయ సమాచారం మేరకు బెండలపాడు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వచ్చారనే సమాచారంతో జిల్లా, తల్లాడ రేంజ్ పరిధిలో అధికారులు ఆ వేటగాళ్ళ కోసం దాడులు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ దాడుల్లో ఆంధ్రాకు ప్రాంతానికి చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు వేటగాళ్లతో పాటు మరో ఇద్దరు స్థానికులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్ కు చెందిన పుష్పాల సుగ్రీవు, వెంకట శ్రీకాంత్, బొడ్డన నారాయణరావు, తినురం విజయ్ నాగరాజుతో పాటు స్థానికులు డేరంగుల మిధున్ కుమార్, బొర్రా సురేష్ లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి గన్ను, కత్తి, మల్టిపుల్ గొడ్డలి, ఒక బుల్లెట్, కారు, ఆరు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

ఈ అటవీ ప్రాంతంలో జింకలు, చిరుత పులులు, పందులు తదితర అటవి జంతువులు ఉంటాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ బృందం సభ్యులు వాటిని వేటాడేందుకు వచ్చినట్లు వివరించారు. అడవి జంతువులను వేటాడుతున్నందుకు వీరికి మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు.

వన్యప్రాణుల్ని వేటాడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. వేటగాళ్లు వస్తున్నారనే సమాచారంతో శని, ఆదివారాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ చేయటం జరుగుతుందని తెలిపారు. లోకల్ గా ఉండే వారు కాకుండా హైదరాబాదు నుంచి వేటగాళ్లు వస్తున్నారని వారిని పట్టుకున్నట్లు తెలిపారు.

ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. ఈ అటవీ ప్రాంతంలో నిరంతరం గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరూ కూడా వన్యప్రాణులను వేటాడవద్దని సూచించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి వెంట సత్తుపల్లి రేంజర్ లావణ్య, డిఆర్ఓ కెవి రామారావు, తల్లాడ రేంజ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు ఉన్నారు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం