AP TS Rains : ఏపీలో మూడు రోజులు, తెలంగాణలో మరో మూడు గంటల్లో- భారీ వర్ష సూచన
AP TS Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీగా ఈదురుగాలులతో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
AP TS Rains : ఏపీ, తెలంగాణలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కేంద్రీకృతమై ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈ ఉపరితల ఆవర్తనం శనివారం ట్రోపో ఆవరణం వరకు విస్తరించింది. ఈ ఉపరితల ఆవర్తన మే 8వ తేదీ ఉదయం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ దిశగా కదిలి మే 9న తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ వాయుగుండం ఉత్తరం వైపు పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించవచ్చని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజులు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో భారీ ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, భద్రాద్రి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందని వెల్లడించింది. వచ్చే మూడు గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురు గాలుల బలంగా వీచే అవకాశం ఉందని ప్రజలను బయటకు రావొద్దని కోరింది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. శనివారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ లో వర్షం
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, చందానగర్, శేరిలింగంపల్లి, కె.పి.హెచ్.బి, బాలానగర్, జీడిమెట్ల, సురారం, మదీనాగూడ, మల్లంపేట్, నిజాంపేట్, గండిమైసమ్మ, కొండాపూర్, హైదర్ నగర్, మియాపూర్ , దుండిగల్, మల్లంపేట్, గండి మైసమ్మ, గాగిల్లాపూర్ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై నీరు చేరిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వెళ్లాలని జీహెచ్ఎంసీ సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి, మొక్కజొన్న , మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు.