Telangana Congress : 'హస్తం' గూటికి అల్లు అర్జున్ మామ..! 'కంచర్ల' కొత్త లెక్క ఇదేనా...?-allu arjun father in law kancharla chandrasekhar reddy joins congress party ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Congress : 'హస్తం' గూటికి అల్లు అర్జున్ మామ..! 'కంచర్ల' కొత్త లెక్క ఇదేనా...?

Telangana Congress : 'హస్తం' గూటికి అల్లు అర్జున్ మామ..! 'కంచర్ల' కొత్త లెక్క ఇదేనా...?

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 27, 2024 11:31 AM IST

BRS leaders Join in Congress Party: బీఆర్ఎస్ కు చెందిన పలువురు ముఖ్య నేతలు శుక్రవారం కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఇందులో సినీ హీరో అల్లు అర్జున్ మామ అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.

కాంగ్రెస్ లో చేరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
కాంగ్రెస్ లో చేరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి

Kancharla Chandrasekhar Reddy: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యే పనిలో పడింది తెలంగాణ కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన జోష్ తో ఉన్న ఆ ఆ పార్టీ… వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురిని పార్టీలో చేర్చుకునే పనిలో పడింది. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్నం కుటుంబంతో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హస్తం కండువా కప్పుకున్నారు. వీరే కాకుండా…. గులాబీ పార్టీకే చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరారు. ఆయన చేరిక నేపథ్యంలో…. ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

గతంలో ఎమ్మెల్యేగా పోటీ

కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancharla Chandrasekhar Reddy).... బీఆర్ఎస్ నేతగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ లో పని చేసిన ఈయన... 2014 ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో చేరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికలో 47,292 ఓట్లు సాధించిన ఆయన... తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో 11,056 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలంపాటు నియోజకవర్గంలో యాక్టివ్ గా పని చేశారు. ఇదిలా ఉండగానే... టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారెక్కారు. దీంతో 2018 ఎన్నికల్లో మంచిరెడ్డికే టికెట్ దక్కింది. ఫలితంగా కంచర్లకు టికెట్ రాకుండా పోయింది. ఆ తర్వాత కొంతకాలంగా సెలైన్స్ ఉన్న ఆయన... గత అసెంబ్లీ ఎన్నికల వేళ స్పీడ్ పెంచారు. ఏకంగా నాగార్జున సాగర్ బరిలో ఉంటానని ప్రకటన కూడా చేశారు. స్థానికంగా అనేక కార్యక్రమాలను కూడా చేపట్టారు.

కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిది సాగర్ నియోజకవర్గం పరిధిలోని భట్టుగూడెం. ఈ ఎన్నికల్లో సాగర్ టికెట్ ఆశిస్తున్న కంచర్ల… స్థానికంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గతేడాది ఆధునిక వసతులతో కూడిన వెయ్యి మందికి సరిపడే ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. దీన్ని ఆయన సొంత అల్లుడు అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే టికెట్ వస్తే… అల్లు అల్లు అర్జున్ కూడా ప్రచారం చేస్తారనే వార్తలు వచ్చాయి. టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ… గులాబీ బాస్ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో నిరాశకు గురయ్యారు కంచర్ల.

ఎంపీ సీటుపై గురి…!

బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన కంచర్ల… శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన చేరికపై అనేక వార్తలు వస్తున్నాయి. మల్కాజ్‌ గిరి ఎంపీ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీలోని ముఖ్య నేతల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అల్లుడు అల్లు అర్జున్ మామగా పేరుండటం కూడా తనకు కలిసివస్తుందని చెప్పారంట…! నిజానికి ఈ స్థానం కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా చేరిన కంచర్లకు టికెట్ వస్తుందా…? రాదా….? అనేది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner