TG Govt : విద్యా కమిషన్ ఛైర్మన్ గా ఆకునూరి మురళి - మరో 2 కమిషన్లకు చైర్మన్ల నియామకం-akunuri murali appointed as chairperson for education commission of telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt : విద్యా కమిషన్ ఛైర్మన్ గా ఆకునూరి మురళి - మరో 2 కమిషన్లకు చైర్మన్ల నియామకం

TG Govt : విద్యా కమిషన్ ఛైర్మన్ గా ఆకునూరి మురళి - మరో 2 కమిషన్లకు చైర్మన్ల నియామకం

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 07, 2024 10:17 AM IST

తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేశారు. విద్యా కమిషన్ ఛైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించింది. మరోవైపు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం 3 కమిషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. విద్యా కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిని నియమించింది. ఇయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో ఉంటారు.

మరోవైపు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఏర్పాటు చేయటంతో పాటు చైర్మన్‌గా ఎం కోదండరెడ్డిని నియమించింది. రెండేళ్లపాటు ఛైర్మన్ గా పని చేయనున్నారు. ఇక బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగియటంతో కొత్త ఛైర్మన్ ను నియమించింది. ఛైర్మన్‌గా నిరంజన్‌కు అవకాశం దక్కింది. రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీ సభ్యులుగా ఉన్నారు . ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వలను జారీ చేశారు.

రాష్ట్రంలో విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 3 ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతోపాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ కమిషన్ కు ఛైర్మన్‌ తో పాటు ముగ్గురు సభ్యులు ఉంటారని తెలిపింది. చైర్‌పర్సన్‌తోపాటు విద్యా రంగాలలో నైపుణ్యం కలిగిన ముగ్గురు సభ్యులు, విభాగాధిపతి స్థాయి సభ్య కార్యదర్శి ఉంటారని పేర్కొంది. కమిషన్‌లోని నాన్-అఫీషియల్ సభ్యుల పదవీకాలం నియామకం తేదీ నుంచి రెండేళ్ల వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిని నియమించింది. సభ్యుల నియామకం జరగాల్సి ఉంది.

కార్పొరేషన్లకు సీఎం పిలుపు:

వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్… ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విరాళం అందజేసింది. కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యతో పాటు అధికారులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి చెక్కున అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఇదే తరహాలో మిగతా కార్పొరేషన్లు కూడా ప్రభుత్వం చేపట్టే సహాయ కార్యక్రమాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద బాధితులను ఆదుకోవడానికి పలు కంపెనీలు, సంస్థలు తమవంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను ప్రకటించాయి. జీఎంఆర్ గ్రూపు సంస్థ 2.5 కోట్ల రూపాయలను విరాళంగా అందజేసింది.

కెమిలాయిడ్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ చైర్మన్ కె.రంగరాజు కోటి రూపాయల విరాళం ప్రకటించి ఆ మేరకు చెక్కును అందించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున విరాళంగా కోటి రూపాయల చెక్కును అందించారు. విర్చో ల్యాబరేటరీస్ సంస్థ తరఫున కోటి రూపాయల చెక్కును అందజేశారు. అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతా రెడ్డి కోటి రూపాయలు విరాళం ప్రకటించి ఆ మేరకు చెక్కును అందజేశారు.

ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎండీ రాయల రఘు ముఖ్యమంత్రిని వారి నివాసంలో కలిసి కోటి రూపాయల విరాళం అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

Whats_app_banner