కరీంనగర్ జిల్లాలో ఆస్తి కోసం తల్లిదండ్రులతో కలిసి అన్నను చంపాడు తమ్ముడు. సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. స్థానికులు ఇచ్చిన క్లూ తో తల్లిదండ్రులతో పాటు తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఈ దారుణ ఘటన హుజురాబాద్ మండలం రాజపల్లిలో జరిగింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజపల్లి కి చెందిన నోముల చంద్రయ్య ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయ చేస్తుండగా చిన్న కొడుకు అంజి కారు డ్రైవర్ గా పని చేస్తూ హైదరాబాద్ లో ఉంటాడు.
అంజి మద్యానికి బానిసై అప్పులపాలై తనకు ఆస్తి ఇవ్వాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన అంజి, తనకు రావాల్సిన భూమి ఇవ్వాలని రాజుతో గొడవ పడ్డాడు. రాజును హతమరిస్తే భూమి మొత్తం తనకే దక్కుతుందనే దుర్బుద్ధితో తల్లిదండ్రులతో కలిసి హత్యకు కుట్ర పన్నాడు. పథకం ప్రకారం ముగ్గురు కలిసి శనివారం రాత్రి రాజు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపై బాది హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా వ్యవహరించారు.
మంచంలో రాత్రి నిద్రపోయిన రాజును కర్రతో బాది హత్య చేసిన తమ్ముడితో పాటు తల్లిదండ్రులు సాదారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కొడుకు లేవడం లేదంటూ తల్లి చుట్టుపక్కల వారికి చెప్పింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా తలపై గాయలు ఉన్నాయి. అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన సిఐ తిరుమల్ సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మంచం లో నిద్రిస్తున్న రాజు తలకు బలమైన గాయాలు ఉండడంతో దాడి జరిగినట్లు గుర్తించారు. దాడి చేసింది ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు.
రాజు శవాన్ని పరిశీలించిన పోలీసులు తలపై బలమైన గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను విచారించారు. నాలుగైదు రోజులుగా ఆస్తి విషయంలో ఇంట్లో గొడవ జరిగిందని చెప్పి, తమ్ముడు అంజిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అంజి తాగుడుకు బానిసై అప్పుల పాలై అన్నతో ఆస్థి పంచి ఇవ్వాలని గొడవ పడినట్లు తెలిపారు.
పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తమ్ముడు అంజి తోపాటు పేరెంట్స్ నేరం ఒప్పుకున్నారు. తల్లిదండ్రుల తోపాటు తమ్ముడు అంజిని అరెస్టు చేసినట్లు హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ తెలిపారు. మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.
ఆస్తి కోసం అన్నను చంపి సాదారణ మరణంగా చిత్రీకరించి కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నించగా పోలీసులు గంటల వ్యవధిలో కేసును ఛేదించారు. ఆస్తి కోసం చిన్న కొడుకు కుట్రలో పేరెంట్స్ భాగస్వామ్యం కావడం పట్ల స్థానికులు దూషించారు. కన్న కొడుకును పొట్టన పెట్టుకున్న పేరెంట్స్ తోపాటు సోదరుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్తికోసం రాజు ప్రాణం తీశారని ఆవేదన వ్యక్తం చేశారు.