Jagityal Tradition: జగిత్యాలలో వింత సాంప్రదాయం.. కాశీ యాత్ర తర్వాత శునకానికి కాలభైరవ పూజ
Jagityal Tradition: కాశీ యాత్ర పూర్తి చేసిన తర్వాత ఆ ఊళ్లో ఓ వింత సాంప్రదాయాన్నిఅనుసరిస్తారు. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి వచ్చిన వారు కాలభైర పూజతో శునకానికి పూజలు చేసే ఆచారం ఉంది.
Jagityal Tradition: జగిత్యాలలో సరికొత్త ఆచారం వెలుగులోకి వచ్చింది. కాశీ యాత్ర చేసి వచ్చిన వారు కాల భైరవ Kaala Bhairava ప్రతిరూపంగా భావించే శునకానికి ప్రత్యేక పూజలు చేసే ఆనవాయితీ జగిత్యాలలో కొనసాగుతుంది.
కాశీ Kaasi పర్యటన ముగించుకుని వచ్చిన పట్టణంలోని వాణినగర్ Vani Nagar కు చెందిన నాగమల్ల రాజేశం, అనంతలక్ష్మీ దంపతులు కాలభైరవుడి రూపంగా భావించే శునకానికి ప్రత్యేక పూజలు చేశారు.
కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో కాలభైరవుని ప్రతిరూపమైన శునకానికి ఆయన దర్శనం అనంతరం స్వస్థలానికి చేరుకున్న తరువాత ప్రత్యేక పూజలు చేయడం తమ ఆనవాయితీ అని వారు తెలిపారు.
పట్టణంలోని తులసి నగర్ లో నివాసం ఉంటున్న ఆకుల నాగరాజు ఇంటికి వెళ్లి శునకానికి ప్రత్యేకంగా అలంకరించి పాద పూజ చేశారు. పూర్వీకుల నుండి వస్తున్న ఈ ఆనవాయితీని అవలంబిస్తున్నామని వివరించారు.
కాశీ యాత్ర... కాల భైరవుని పూజ
కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. అయితే అక్కడకు వెళ్ళే భక్తులు చాలా మంది విశ్వనాథుడి కన్నా ముందు కాల భైరవుడిని దర్శించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.
అనంతరం కాశీలో ఉన్న మృత్యుంజయ మందిరంతో పాటు వివిధ ఆలయాల్లో పూజలు చేసి ఇంటికి చేరుకుంటారు. కాశీ యాత్ర ముగించుకుని వచ్చిన వారికి కొన్ని ప్రాంతాల్లో ఇంటిల్లిపాది మంగళహారతులతో ఆహ్వానం పలకడం ఆనవాయితీగా వస్తోంది.
పూర్వ కాలంలో కాశీ యాత్ర చేసి తిరిగి ఇంటికి చేరడమంటే గొప్ప కార్యం జరిగినట్టేనని అనుకునే వారు. అప్పుడు “కాశీకి వెల్తే కాటికి” చేరినట్టే అన్న నానుడి కూడా వాడుకలో ఉండేది. గతంలో రహదారి సౌకర్యాలు లేకపోవడంతో కాశీకి వెళ్ళే భక్తులు నెలల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది.
దీంతో కాశీ పుణ్య క్షేత్ర దర్శనం చేయడం అంటే అత్యంత గొప్ప విషయంగా భావించే వారు. ఈ కారణంగానే కాశీకి వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చిన వారికి పూజలు చేసే సాంప్రాదాయం కొనసాగేది. కానీ ఇప్పుడు కాశీ విశ్వేశరుడిని దర్శించుకుని వచ్చిన తరువాత శునకానికి పూజలు చేయడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.