HDFC Insurance Fraud: ఫేక్ డాక్యుమెంట్లతో బీమా సొమ్ము ఎగవేతకు పన్నిన ప్లాన్ ఫెయిల్
HDFC Insurance Fraud: బీమా డబ్బులు ఎగ్గొట్టేందుకు ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన పని ఇప్పుడు పాలసీదారుల్లో దడ పుట్టిస్తోంది. పాలసీ మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు అనైతిక పద్ధతుల్ని అనుసరించడం చర్చనీయాంశంగా మారింది.
HDFC Insurance Fraud: బీమా సొమ్మును పాలసీదారుడి కుటుంబానికి చెల్లించకుండా ఉండేందుకు ఓ ప్రముఖ బీమా సంస్థ నకిలీ పత్రాలను సృష్టించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.
పాలసీ చేయించుకున్న మహిళ మరణించడంతో బీమా మొత్తాన్నిఆమె కుటుంబానికి చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు అనైతిక మార్గాలను అనుసరించారు. మృతురాలు ఆస్పత్రిలో చికిత్స పొందారని, వాటిని దాచిపెట్టి తమ వద్ద పాలసీ తీసుకున్నారని సదరు సంస్థ ఆరోపించింది.
ఈ క్రమంలో బాధిత కుటుంబం వినియోగదారుల రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. బీమా కంపెనీ డబ్బులు ఎగ్గొట్టడానికి, ఓ వైద్యుడి సంతకాలను ఫోర్జరీ చేసి ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు పత్రాలు సృష్టించిన వైనం వెలుగు చూసింది.
బీమా కంపెనీ పేర్కొన్న తేదీల్లో తాను ఆ ఆస్పత్రిలో పనిచేయలేదని వైద్యుడు కూడా వాంగ్మూలం ఇవ్వడంతో హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థపై వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. పాలసీ సొమ్ము రూ75లక్షలను 7శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. 2018నుంచి వడ్డీని బాధితులకు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఖర్చుల కింద మరో రూ.25వేలు చెల్లించాలని తీర్పునిచ్చారు.
ఏం జరిగిందంటే….
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడకు చెందిన ఇ. భాగ్యమ్మ 2018లో మృతి చెందారు. ఆమె 2016లో రూ.75 లక్షల మొత్తానికి హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి బీమా పాలసీ తీసుకున్నారు. రెండేళ్లపాటు పాలసీ కోసం రూ.30 వేల చొప్పున ప్రీమియం చెల్లించారు. 2018లో భాగ్యమ్మ గుండెపోటుతో మృతి చెందారు. పాలసీ డబ్బు ఇప్పించాలని భాగ్మమ్మ భర్త సహదేవకుమార్ దరఖాస్తు చేశారు. దీనిని బీమా సంస్థ తిరస్కరించింద. పాలసీదారుకు గతంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, బీపీతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, యాంజియో ప్లాస్టీ కూడా చేసినట్టు రికార్డులు ఉన్నాయని క్లెయిమ్ తిరస్కరించారు.
బీమా సంస్థ నిర్ణయాన్ని సహదేవ కుమార్ వినియోగదారుల కమిషన్‌లో సవాలు చేశారు. పాలసీ సొమ్ము రూ. 75 లక్షలను 15 శాతం వడ్డీతో ఇప్పించాలని, పరిహారంగా రూ.5 లక్షలు, ఖర్చుల కింద రూ.లక్ష ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై కమిషన్ సభ్యులు కె. రంగారావు, ఆర్. ఎస్.రాజెశ్రీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
పాలసీదారు బీమా పాలసీ తీసుకునే సమయంలో వాస్తవాలు చెప్పలేదని, 2015 జూన్ 15 నుంచి 19 వరకు సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందారని తమ విచారణలో తేలడంతో పరిహారాన్ని తిరస్కరించినట్లు పేర్కొన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పాలసీదారుకు గతంలో ఆరోగ్య సమస్యలు లేవని, సిగ్మా ఆసుపత్రిలో ఎప్పుడు, ఎలాంటి చికిత్స తీసుకోలేదని, కంపెనీ సమర్పించిన డాక్టర్‌ను విచారించాలని కోరారు.
ఈ నేపథ్యంలో కమిషన్ ఆదేశాలతో విచారణకు హాజరైన సిగ్మా ఆసుపత్రి డాక్టర్ కె.అనూప్రోమన్ ఆ ఆసుపత్రిలో తాను 2016లో చేరానని, 2015లో ఎవరికి చికిత్స చేయలేదని స్పష్టం చేశారు. పాలసీ దారు భాగ్యమ్మ పేరుతో ఇచ్చిన చికిత్సలకు సంబంధించిన ఎలాంటి చికిత్సల రికార్డు లేదని, బీమా కంపెనీ రికార్డులోని చేతిరాత కూడా తనది కాదని, సంతకాన్ని ఫోర్జరీ చేశారని వాంగ్మూలం ఇచ్చారు.
ఈ పరిణామాలతో బీమా కంపెనీ వాదనలకు గైర్హాజరైంది. గతంలో ఇచ్చిన సాక్ష్యాలను నిరూపించుకోడానికి కమిషన్ గడువు ఇచ్చినా ఆ సంస్థ వాటిని వినియోగించుకోలేదు. పాలసీపై విచారణ జరిపిన వ్యక్తిని, బీమా సంస్థ బ్రాంచి మేనేజర్లను ప్రశ్నించడానికి పిటిషనర్ తరపు న్యాయవాది కోరినా వారు విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో గతంలో పాలసీదా రుకు చికిత్స జరిగిందని నిరూపించడంలో హెచ్‌డిఎఫ్‌సి బీమా సంస్థ విఫలమైందని పేర్కొన్నారు. పాలసీ మొత్తాన్ని 2018నుంచి 7శాతం వడ్డీతో చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించారు.
సంబంధిత కథనం