Sangareddy District : నిబంధనల ఉల్లంఘన...! 5 మైనింగ్ కంపెనీలు మూసివేత, 22 లక్షల జరిమానా
Sangareddy District News: నిబంధనలు ఉల్లంఘించిన పలు మైనింగ్ కంపెనీలపై చర్యలు తీసుకున్నారు సంగారెడ్డి జిల్లా అధికారులు. ఐదు కంపెనీలను మూసివేయటంతో పాటు రూ. 22 లక్షల జరిమానాను విధించారు.
Sangareddy District News: నిబంధనలు ఉల్లంఘించిన ఐదు మైనింగ్ కంపెనీలను మూసివేశామని సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు. మైనింగ్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మైనింగ్ కంపెనీలు నిబంధనలు ఉల్లఘింస్తున్నాయని ఆరోపణలు రావటంతో, ప్రభుత్వం, రవీంద్ర రెడ్డి ని చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ కమిటీ ని ఏర్పాటు చేసిందన్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీ తనిఖీలు చేపట్టి, పలు కంపెనీలు నిబంధనలు అతిక్రమించాయి అని తేల్చి చెప్పారు.
గురువారం సంగారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవో రవీందర్ మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు మండలం లక్డారం,జిన్నారం మండలం ఖాజీపల్లిలో మొత్తం 78 మైనింగ్ కంపెనీలు ఉన్నాయన్నారు. ఇందులో ఐదు (5) మైనింగ్ కంపెనీలు నిబంధనలకు లోబడి పని చేయకపోవడం వల్ల వాటిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అధిక లోడ్ తో వెళ్ళుతున్న వాహనాలను గుర్తించి, మైనింగ్ కంపెనీలకు సంబందించిన 79 వాహనాలకు రూ. 22 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. ఖాజిపల్లి పరిధిలో 18 మైన్స్ క్వారీలపై వివిధ ఫిర్యాదులు అందాయని, వాటిపై కాలుష్య నివారణ మండలి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . నిబంధనలకు విరుధంగా ఆయ శాఖల సమన్వయంతో మొత్తం 26 పోలీస్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. నిబంధనలకు విరుధంగా మైనింగ్ కంపెనీలు నిర్వహించినచో వారిపై కఠినమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు......
రానున్న పార్లమెంట్ ఎన్నికల లో ఎన్నికల ప్రవర్తన నియమాల్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై మొదటి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు అధికారులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ఎన్నిసార్లు నిర్వహించిన కొత్తగా ఉంటుందని, ఎన్నికల నియమావళి ఆధారంగా ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుందని ఆమె తెలిపారు. గతంలో నిర్వహించిన విధంగానే ఎటువంటి సమస్య లేకుండా ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ వలరబుల్ మ్యాపింగ్ ద్వారా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతో ఎన్నికల విధులు మొదలుపెట్టాలని, సెక్టార్ అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాలలోని పోలింగ్ కేంద్రాల పరిధిలోని పెద్దలతో సమావేశం నిర్వహించి ఓటర్లు ఎటువంటు ప్రలోభాలకు లొంగకుండా అమూల్యమైన ఓటును వినియోగించుకునేలా అవగాహనా సదస్సులు ఏర్పాటుచేయాలన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, కోడ్ అమలులోకి రాగానే నిర్వహించే విధుల పట్ల పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీ అమలులో భాగంగా మద్యం, డబ్బు అక్రమ పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికలను సైతం సమర్థవంతంగా పూర్తి చేయుటకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, విధులు, ఏర్పాట్లు, తదితర విషయాలపై జిల్లా స్థాయి ట్రైనర్ కృష్ణ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు.