Nizamabad District : `మైనింగ్` అక్రమాలపై కొరడా..! తీగలాగుతున్న అధికారులు
Mining in Nizamabad District : నిజామాబాద్ జిల్లాలో `మైనింగ్` అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతోంది అధికార యంత్రాంగం. రాష్ట్ర కార్యాలయ ఆదేశాల మేరకు తీగలాగుతున్నారు.
Mining in Nizamabad District : బీఆర్ఎస్ హయంలో మైనింగ్ కార్యకలాపాల్లో భారీగా అక్రమాలు, అవినీతి జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అధికారం అడ్డుపెట్టుకుని సహజ సంపదనను ఏ విధంగా దోచుకున్నారనే అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. అందులో భాగంగా ఒక్కో క్వారీపై ఒకే కాలంలో కాకుండా దశలవారిగా అన్ని వివరాలను బయటకు తీయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా మైనింగ్ శాఖకు ఆదేశాలు జారీ అవుతున్నాయి. రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చిందే తడవుగా జిల్లా అధికారులు ఆయా మైనింగ్ క్వారీలపై పూర్తి విచారణ చేపడుతున్నారు. ఇక పెద్దఎత్తున ఆరోపణలు ఉన్న క్వారీలకు నేరుగా హైదరాబాద్ నుంచి రాష్ట్ర అధికారుల బృందం వచ్చి తనిఖీలు చేపడుతోంది. దీంతో అక్రమార్కులకు నిద్రపట్టడం లేదు. ఏ నిమిషం ఏం జరుగుతుందనేది ఆందోళనగా మారింది.
నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం అనుమతి పొందినవి 50 క్వారీలున్నాయి. అయితే ఈ క్వారీల్లోనూ గత పదేండ్లుగా తనిఖీలు లేవు. అందులో కొంతమంది రాజకీయ నాయకులకు చెందినవి కావడంతో అటువైపుగా అధికారులు దృష్టిసారించలేదు. కానీ ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీజేపీ సైతం 8 స్థానాల్లో గెలుపొందడంతో పరిస్థితి తారుమారయ్యింది. ఇటీవల ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి ఫిర్యాదుతో జీవన్‌రెడ్డికి చెందిన బంధువుల, అనుచరుల క్వారీలో అధికారులు విచారణ చేపట్టారు. ఆర్మూరు, మాక్లూర్‌కు చెందిన రెండు క్వారీల్లో అధికారలు దర్యాప్తు ప్రారంభించారు.
క్వారీ లీజు సమయంలో ఎన్ని క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చాం? ఎన్ని క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరిపారు? ఒకవేళ ఉల్లంఘన జరిగితే ఎంత మొత్తంలో జరిగింది తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేపట్టారు. అయితే ఈ రెండు క్వారీలకు సంబంధించి ఇంకా రిపోర్టు రాలేదు. విచారణ బృందాలు అన్ని కొలతలు తీసుకుని నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. ఒకవేళ అవకతవకలు బయటపడితే ఆర్మూరు మాజీ ఎమ్మెల్యేకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. జిల్లా మైనింగ్ అధికారులు సైతం.. నివేదిక వచ్చిన తరువాత ఎంత మొత్తంలో జరిమానాలు విధించడం, ఏం చర్యలకు ఉపక్రమించాలనే విషయం తెలుస్తుందని చెబుతున్నారు. అయితే జిల్లాలో క్వారీల్లో అవకతవకలపై గతంలోనూ పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అప్పటి ఆర్అండ్‌బి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిపై బాల్కొండ బీజేప నాయకులు మల్లిఖార్జునరెడ్డి హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలోనే ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరగలేదు. ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో ఏడేళ్లుగా పర్యావరణ అనుమతులు లేకుండా క్వారీ నడుస్తోందని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరిపి వెంటనే ఈటీఎస్ ( ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) సర్వే నిర్వహించాలని బీజేపీ నేత కోరారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు సైతం చేశారు.
క్వారీ లీజుకు తీసుకున్న జియో స్టోన్ ఇండస్ట్రీస్ 10,000 క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకొని 12 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్వారీ స్కాం లో ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. పైగా క్వారీ నుండి క్రషర్ కి, క్రషర్ నుండి బహిరంగ మార్కెట్ కి పెద్ద ఎత్తున సరుకు నడపడానికి రిజర్వ్ ఫారెస్ట్ లో నిబంధనలు బేఖాతలు చేస్తూ కంకర రోడ్డు వేసినారని, దీన్ని పరిశీలించడానికి వచ్చిన అప్పటి రేంజ్ ఆఫీసర్ ను మంత్రి ప్రశాంత్ రెడ్డి తన పలుకుబడితో 24 గంటల్లో బదిలీ చేయించారని ఆరోపించారు.
క్వారీ అక్రమాలపై హైదరాబాద్ లోని గనుల శాఖ డైరెక్టర్ కి కి ఫిర్యాదు చేశామని, దీని మీద ఈటిఎస్ సర్వే నిర్వహించాలని అసిస్టెంట్ డైరెక్టర్ నిజామాబాద్ కి ఆదేశాలు ఇస్తే, సర్వే చేయుటకు డబ్బులు జమ చేయాలని సంబంధిత లీజు సంస్థకి అధికారులు లేఖల ద్వారా తెలిపినా స్పందించలేదని అన్నారు. సర్వే చేస్తే అసలు విషయాలు బయటపడతాయని సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం కనీసం 200 కోట్లకు పైగా జరిమానా పడే అవకాశం ఉందని పలుమార్లు పెర్కొన్నారు.
రిపోర్టింగ్: భాస్కర్, నిజామాబాద్ జిల్లా