Lok Sabha elections 2024: ఆ తరువాతే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల!-lok sabha elections 2024 dates schedule likely to be released after march 13 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections 2024: ఆ తరువాతే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల!

Lok Sabha elections 2024: ఆ తరువాతే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల!

HT Telugu Desk HT Telugu
Feb 23, 2024 03:17 PM IST

Lok Sabha elections 2024: ఈ సంవత్సరం జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే, 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, మార్చి 13 తరువాతనే ఈ నోటిఫికేషన్ వస్తుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

ముంబైలో ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు
ముంబైలో ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు

Lok Sabha elections 2024 schedule: మార్చి 13 తర్వాత 2024 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం (Election Commission of India ECI) ప్రకటించే అవకాశం ఉందని ఈసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధతను అంచనా వేస్తోంది. ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం అధికారులు మార్చి 13 నాటికి ముగించనున్నాయి.

కొనసాగుతున్న ఈసీ కసరత్తు

భారత ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు వివిధ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) తరలింపు, భద్రతా సిబ్బంది అవసరం, రాష్ట్ర సరిహద్దుల వెంబడి నిఘా వంటి ఆచరణాత్మక సమస్యలను పరిశీలిస్తున్నారు. స్వయంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటించి, క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే అవకాశమున్న సవాళ్లపై ఆయా రాష్ట్రాల అధికారులతో చర్చిస్తున్నారు.

పార్టీల సన్నద్ధత

మరోవైపు, రానున్న లోక్ సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీ ఏ.. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటములు ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరాడడానికి సిద్ధమవుతున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు ఆయా రాష్ట్రాల్ల సీట్ల పంపకంపై చర్చలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు, ఏ కూటమిలోనూ లేని ప్రాంతీయ పార్టీలు సొంతంగా గణనీయమైన సంఖ్యలో లోక్ సభ స్థానాలను గెల్చుకోవాలని ఆశిస్తున్నాయి.

2019 లో మార్చి 10న..

మునుపటి 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఎన్నికల సంఘం మార్చి 10న షెడ్యూల్ ను ప్రకటించింది. 543 సీట్ల లోక్‌సభకు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మే 23న జరిగింది. 2019లో దాదాపు 912 మిలియన్ల (91.2 కోట్లు) మంది ఓటర్లలో 67% కంటే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంవత్సరం, ECI డేటా ప్రకారం, దాదాపు 970 మిలియన్ల (97 కోట్లు) మంది ప్రజలు ఓటర్లుగా నమోదై ఉన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్ సభ ఎన్నికలతో పాటే జరగనున్నాయి.

Whats_app_banner