Karimnagar Dogs: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో కుక్కల స్వైర విహారం, 30మందికి గాయాలు
Karimnagar Dogs: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వీదికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మందిపై దాడి చేశాయి. నలుగురికి తీవ్ర గాయాలు కాగా వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
Karimnagar Dogs: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వీదికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మందిపై దాడి చేశాయి. నలుగురికి తీవ్ర గాయాలు కాగా వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
హుజురాబాద్ పటణంలోని ప్రతాపవాడ, మామిండ్లవాడ, గాంధీనగర్, పద్మనగర్, విద్య నగర్, ఏకలవ్యనగర్ తో పాటు బోర్నపల్లి గ్రామంలో వీధి కుక్కలు ప్రజలపై దాడి చేసి గాయపర్చాయి. దారిలో వెళ్ళే వారిపై ఎగబడి కరవడంతో పలువురికి రక్తగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
కుక్కకాటు బాధితులు వారి బంధువులతో ఆసుపత్రి కిటకిటలాడింది. గాయపడ్డ వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎం జి ఎం కు తరలించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపోను ఇంజెక్షన్ లు లేకపోవడంతో కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళారు. ఒకే రోజు 30 మందిపై వీది కుక్కలు దాడి చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
500 కుక్కలను అడవికి పంపిన మున్సిపల్ అధికారులు
రోజురోజుకు హుజురాబాద్ లో కుక్కల బెడద పెరగడంతో మున్సిపల్ అధికారులు కుక్కలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కుక్కలను పట్టే వారిని తీసుకువచ్చి ఐదు రోజుల్లో 500 కుక్కలను పట్టి అడవి ప్రాంతానికి తరలించారు. ఒక్కొక్క కుక్కకు మున్సిపల్ నుంచి 300 నుంచి 500 రూపాయల వరకు చెల్లిస్తున్నారు.
ఇక కుక్కల బెడద లేదనుకుంటున్న తరుణంలో పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేయడంతో అసలు మున్సిపల్ అధికారులు కుక్కలను పెట్టించారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగితాలపై లెక్కలు చూపి మున్సిపల్ డబ్బులు కాజేశారా అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మునిసిపల్ అధికారులు కాకి లెక్కలు చెప్పకుండా వీధి కుక్కలను సమూలంగా నిర్మూలించి కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని జనం కోరుతున్నారు.
(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)