World Cup 2023 : మేం చెన్నై, బెంగళూరులో ఆడలేం.. మళ్లీ పాకిస్థాన్ రిక్వెస్ట్
ICC World Cup 2023 : ఐసీసీ వరల్డ్ కప్ 2023 దగ్గర పడుతోంది. బెంగుళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా, చెన్నైలోని MA చిదంబరం స్టేడియం (CHEPAK)లో ఆఫ్ఘనిస్తాన్‌తో పాకిస్థాన్ ఆడనుంది. అయితే పాకిస్థాన్ మాత్రం మరో విషయంతో ముందుకు వచ్చింది.
ఆసియా కప్ (Asia Cup 2023) విషయంలో చాలా కాలంగా BCCIతో చిన్నపాటి యుద్ధం చేసిన పాకిస్థాన్ ఇప్పుడు ప్రపంచ కప్‌పై వివాదం తీసుకువచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎన్నో కసరత్తుల తర్వాత ఆసియా కప్ ప్లాన్ ఖరారైంది. వరల్డ్ కప్ ఆడేందుకు కూడా సిద్ధమైంది. అయితే పాకిస్థాన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ (PCB) బెంగళూరు, చెన్నైలలో జరగాల్సిన మ్యాచ్‌లను మార్చాలని కోరినట్లు సమాచారం. వాస్తవానికి బీసీసీఐ రూపొందించిన ముసాయిదా షెడ్యూల్ ప్రకారం బెంగళూరులో ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతోనూ, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ఆఫ్ఘనిస్థాన్‌తోనూ పాకిస్థాన్ తలపడనుంది. బీసీసీఐ(BCCI) తీసుకున్న ఈ నిర్ణయం పాక్ జట్టును ఆందోళనకు గురి చేసింది. అందువల్ల ఈ రెండు చోట్ల జరుగుతున్న మ్యాచ్ లను మార్పు చేయాలని పాకిస్థాన్ బోర్డు కోరినట్లు సమాచారం.
అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్(ODI World Cup) కోసం భారత్ కు పాకిస్థాన్ రానుంది. కానీ బీసీసీఐ షెడ్యూల్ చేసిన వేదికలపై సందేహాలు లేవనెత్తింది పాకిస్థాన్. గతంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడేందుకు నిరాకరించిన పాకిస్థాన్.. పలు విమర్శల అనంతరం మోదీ స్టేడియంలో ఆడేందుకు అంగీకరించింది. ఇప్పుడు ఐసీసీకి పాకిస్థాన్ కొత్త సమస్యను తీసుకొచ్చింది.
క్రికెట్ పాకిస్థాన్ నివేదిక ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌ల కోసం వేదికను మార్చాలని పీసీబీ అభ్యర్థిస్తున్నట్లు సమాచారం. వేదిక మార్పుకు కారణాన్ని తెలిపిన పాకిస్థాన్.. చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు మరింత అనుకూలంగా ఉందని పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్ జట్టులో రషీద్ ఖాన్(Rashid Khan), నూర్ అహ్మద్ సహా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇది పాకిస్థాన్ జట్టు నాకౌట్‌కు చేరే అవకాశాలపై ప్రభావం చూపుతుందని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. అందుకే అఫ్గానిస్థాన్‌తో చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌ను బెంగళూరుకు మార్చాలని పాకిస్థాన్ బోర్డు(Pakistan Board) డిమాండ్ చేసినట్లు సమాచారం.
అలాగే బెంగళూరులో ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను వేరే చోటికి మార్చాలని అభ్యర్థించింది. బెంగళూరు పిచ్ బ్యాట్స్‌మెన్ స్వర్గధామం అని అందరికీ తెలిసిందే. అలాగే పిచ్ స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువగా సహాయపడుతుంది. ఆసీస్‌కు నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగం ఉండడంతో బెంగళూరు పిచ్‌పై ఆసీస్ పేసర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని, అందువల్ల, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌లతో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం వేదికలను మార్చాలని పీసీబీ అభ్యర్థించినట్లు సమాచారం.
బిసీసీఐ, ఐసీసీ(ICC) సమర్పించిన ముసాయిదా షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 15 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. పాకిస్థాన్ మొదట్లో అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించింది, అయితే ICC ప్రెసిడెంట్ గ్రెగ్ బార్క్లే, CEO జియోఫ్ అల్లార్డైస్ ఎంటరై.. పాకిస్థాన్ బోర్డుని ఒప్పించగలిగారు.