Virat Kohli in IPL 2023: ఈసారి ఐపీఎల్లో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లియే: ఆకాశ్ చోప్రా
Virat Kohli in IPL 2023: ఈసారి ఐపీఎల్లో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లియే అని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున విరాటే అత్యధిక పరుగులు చేస్తాడని చెప్పాడు.
Virat Kohli in IPL 2023: ఐపీఎల్ గత సీజన్ లో విరాట్ కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 22 సగటుతో 341 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈసారి కోహ్లి మళ్లీ టాప్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. దీంతో ఐపీఎల్ 2023(IPL 2023)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున కోహ్లియే టాప్ స్కోరర్ గా నిలుస్తాడని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.
ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్న ఫాఫ్ డుప్లెస్సి, విరాట్ కోహ్లిలలో ఎవరు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలుస్తాడని అని ప్రశ్నించగా.. కోహ్లియే అని చోప్రా స్పష్టం చేశాడు. గతేడాదే ఈ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన డుప్లెస్సి.. ఆర్సీబీని ప్లేఆఫ్స్ కు తీసుకెళ్లాడు. కోహ్లి ఫామ్ లో లేకపోయినా.. డుప్లెస్సితోపాటు రజత్ పటీదార్ లాంటి ఇతర బ్యాటర్లు రాణించారు.
2022 సీజన్ లో డుప్లెస్సి 468 రన్స్ చేశాడు. అయితే ఈసారి మాత్రం డుప్లెస్సిని కోహ్లి వెనక్కి నెట్టడం ఖాయమని ఆకాశ్ చోప్రా అంటున్నాడు. "ఈ జట్టులో ఎవరు టాప్ స్కోరర్.. ఫాఫ్ లేదా విరాట్ కోహ్లి? నేను విరాట్ కోహ్లి అంటున్నాను. గతేడాది విరాట్ సరిగా ఆడలేదు. ప్రతిసారీ అలా జరగదు. అతడు ఈసారి పరుగులు చేస్తాడు.
దీంతో టీమ్ మరింత బలోపేతం అవుతుంది. వాళ్ల దగ్గర ఫాఫ్ డుప్లెస్సి రూపంలో మంచి కెప్టెన్ ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే విరాట్, ఫాఫ్ ఓపెనింగ్ చేస్తారు. రజత్ పటీదార్ మూడోస్థానంలో వస్తాడు" అని జియో సినిమాతో మాట్లాడుతూ ఆకాశ్ చెప్పాడు.
"ఇక నాలుగోస్థాంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ లాంటి వాళ్లు బ్యాటింగ్ ఆర్డర్ లో ఉంటారు. వాళ్ల బ్యాటింగ్ బాగుంది" అని చోప్రా అన్నాడు. ఇక గత వేలంలో ఆర్సీబీ రూ.3.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ విల్ జాక్స్ ఈ లీగ్ కు దూరమయ్యాడు. ఇది ఆర్సీబీకి పెద్ద షాకే.
అతని స్థానంలో న్యూజిలాండ్ కు చెందిన మైకేల్ బ్రేస్‌వెల్ ఆర్సీబీతో చేరాడు. బ్రేస్‌వెల్ మంచి టీ20 ప్లేయర్ అని, అతని బౌలింగ్ పెద్దగా ఉపయోగపడకపోయినా.. బ్యాటింగ్ లో మాత్రం ఆర్సీబీకి పనికొస్తాడని ఆకాశ్ చోప్రా చెప్పాడు.
సంబంధిత కథనం