IPL 2023 New Rules: ఐపీఎల్ 2023లో కొత్త రూల్స్.. టాస్ తర్వాతే తుది జట్టు ప్రకటన
IPL 2023 New Rules: ఐపీఎల్ 2023లో కొత్త రూల్స్ వచ్చేశాయి. ఇక నుంచి టాస్ తర్వాతే తుది జట్టు ప్రకటన చేసుకునే అవకాశం కెప్టెన్లకు కలుగుతుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ చూసి ఈ కొత్త రూల్ ను ఐపీఎల్లో ప్రవేశపెట్టారు.
IPL 2023 New Rules: ఇన్నాళ్లూ క్రికెట్ లో టాస్ వేసే ముందే రెండు జట్ల కెప్టెన్లు తమ తుది జట్లను ప్రకటించాల్సి ఉండేది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం టాస్ తర్వాతే కెప్టెన్లు తమ తుది జట్లకు సంబంధించిన షీట్లను ప్రత్యర్థి కెప్టెన్, రిఫరీకి అందజేస్తాడు. ఈ ఏడాది తీసుకొచ్చిన కీలక మార్పుల్లో ఇదే ప్రధానమైనది కావడం విశేషం.
ప్లేయింగ్ కండిషన్స్ 1.2.1 ప్రకారం.. "ఓ కెప్టెన్ 11 మంది ప్లేయర్స్ సహా ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లను నామినేట్ చేయొచ్చు. టాస్ తర్వాత ఈ పేర్లను మ్యాచ్ రిఫరీకి ఇవ్వాలి. నామినేషన్ తర్వాత మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రత్యర్థి కెప్టెన్ అనుమతి లేకుండా తుది జట్టులోని ప్లేయర్ ను మార్చే అవకాశం లేదు" అనేది ఈ కొత్త నిబంధన.
ఆ లెక్కన టాస్ పడిన తర్వాత, మ్యాచ్ ప్రారంభమయ్యేలోపు పరిస్థితులకు తగినట్లు తుది జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఓ కెప్టెన్ కు ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు అని చెప్పొచ్చు. దీనివల్ల టాస్ వల్ల కలిగే అదనపు లబ్ధి ఆయా టీమ్స్ కు ఇక ఉండదు. మొదట బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ కు తగినట్లుగా తుది జట్టు కూర్పు చేసుకునే వీలు కలుగుతుంది.
అంతేకాదు ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టేబోయే ఇంపాక్ట్ ప్లేయర్ ను ఎంపిక చేసుకునే విషయంలోనూ కెప్టెన్లకు వెసులుబాటు దొరుకుతుంది. ఇక ఈ ఏడాది మరో కీలకమైన మార్పు గురించి చెప్పాలంటే.. వికెట్ కీపర్ లేదా ఫీల్డర్.. బంతి వేయక ముందే కదిలితే ప్రత్యర్థి జట్టు ఐదు పరుగులు ఇస్తారు. అంతేకాదు దానిని డెడ్ బాల్ గా ప్రకటిస్తారు.
ఇక నిర్ణీత సమయంలోపు 20వ ఓవర్ ప్రారంభం కాకపోతే.. ఆ తర్వాత మిగిలిన ఓవర్లు అన్నింటికీ సర్కిల్ బయట నలుగురు కంటే ఎక్కువ మంది ఫీల్డర్లను మోహరించే అవకాశం ఫీల్డింగ్ జట్టుకు ఉండదు. ఈ మార్పులు ఈ ఏడాది ఐపీఎల్లో మ్యాచ్ ల ఫలితాలన ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు.
సంబంధిత కథనం