Suryakumar Yadav Diet: మిస్టర్ 360గా మారడానికి డైట్ మార్చేశాడు.. సూర్యకుమార్ తినే ఫుడ్ ఇదే
Suryakumar Yadav Diet: మిస్టర్ 360గా మారడానికి డైట్ మార్చేశాడట సూర్యకుమార్ యాదవ్. ఫీల్డ్ లోపలే కాదు.. బయట అతడు తన ఆహారం విషయంలో తీసుకున్న జాగ్రత్తలు చూస్తే మతి పోతుంది. ఈ విషయాలను అతని న్యూట్రిషనిస్ట్ శ్వేతా భాటియా వెల్లడించారు.
Suryakumar Yadav Diet: ఏం తింటున్నాడు రా బాబూ.. ఇలా బాదుతున్నాడు అని సూర్యకుమార్ ఆట చూసిన ఎవరైనా అనుకోవాల్సిందే. పూనకం వచ్చిన వాడిలాగా గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటికే వెయ్యికి పైగా రన్స్ చేసి ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇండియన్ టీమ్‌కు పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు.
క్రికెట్‌లో నయా మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరుగాంచిన సూర్యకుమార్.. ఫీల్డ్‌లోనే కాదు బయట కూడా తన డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతడిలా మారడం వెనుక ఎంతో ప్లానింగ్ ఉందని, తన ఆహార అలవాట్లను అతడు పూర్తిగా మార్చేసుకున్నాడని సూర్య వ్యక్తిగత న్యూట్రిషనిస్ట్ శ్వేతా భాటియా వెల్లడించారు. ఏడాది కాలంగా అతని ఫిట్‌నెస్ పెంచడానికి పని చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
సూర్య ఐదు పాయింట్ల ఎజెండా
సూర్య తన ఫిట్‌నెస్ కోసం ఐదు పాయింట్ల ఎజెండాను ఫాలో అయినట్లు శ్వేతా తెలిపారు. ఇందులో మొదటిది ట్రైనింగ్‌తోపాటు మ్యాచ్‌లలో పర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచుకోవడం. రెండోది, ముఖ్యమైనది శరీరంలోని కొవ్వును అథ్లెటిక్ జోన్ (12-15 శాతం)లోనే ఉండేలా చూసుకోవడం. మూడోది అతడు ఎప్పుడూ ఎనర్జటిక్‌గా ఉండేలా డైట్ ఉండాలి. నాలుగోది తరచూ శక్తిని పొందాల్సిన అవసరం రాకుండా చూసుకోవడం. చివరిది ప్రతి అథ్లెట్‌కు అవసరమైన రికవరీని ప్రమోట్ చేయడం.
దీనికోసం సూర్య తీసుకునే కార్బొహైడ్రేట్‌ను శ్వేతా పూర్తిగా తగ్గించేశారు. తక్కువ కార్బొహైడ్రేట్స్ వల్ల పర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచవచ్చని తాజా అధ్యయనాలు నిరూపించినట్లు ఆమె చెప్పారు. అతని డైట్‌లో అధిక కార్బొహైడ్రేట్లను తగ్గించి, ఆరోగ్యకరమైన నట్స్, ఒమెగా 3లను చేర్చినట్లు వెల్లడించారు. గుడ్లు, చేపలు, మాంసం, డెయిరీ ఉత్పత్తులు, కూరగాయల నుంచి ఎక్కువగా ప్రొటీన్ పొందినట్లు తెలిపారు.
శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఓ పద్ధతి ప్రకారం ఫ్లుయిడ్స్, ఎలక్ట్రోలైట్స్‌ను సూర్యకు అందించినట్లు ఆమె చెప్పారు. గత ఏడాది కాలంగా తన ఫిట్‌నెస్‌పై చాలా దృష్టి సారించిన సూర్య ఇప్పుడిలా 360 డిగ్రీ ప్లేయర్‌గా మారిపోయాడు. గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొట్టడానికి శరీరాన్ని దానికి తగినట్లు మార్చుకోవడం చాలా ముఖ్యం. లేదంటే గాయాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. సూర్య సరిగ్గా ఇదే దిశలో తన ట్రైనింగ్, డైట్ ప్లాన్ కొనసాగించాడు. ఇక శరీరంలో శక్తిని పెంచే కెఫిన్ అనే పవర్ సప్లిమెంట్ డ్రింక్‌ను కూడా తీసుకుంటాడు.
సూర్యకూ త్యాగాలు తప్పలేదు
ప్రస్తుతం టీమ్‌లో ఉన్న విరాట్ కోహ్లి ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిట్‌గా ఉండటానికి విరాట్ చాలా రోజుల కిందటే వెజిటేరియన్‌గా మారాడు. జంక్ ఫుడ్‌కు పూర్తి దూరంగా ఉంటున్నాడు. సూర్య కూడా అలాంటి త్యాగాలే చేశాడు. బిర్యానీలు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌ల వంటి వాటికి అతడు దూరం. ఎలాగైనా సరే క్రికెట్ ఫీల్డ్‌లో సక్సెస్ సాధించాలన్న అతని ఆకలి ఇలాంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారానికి దూరం చేసింది.