Gavaskar on Suryakumar: సూర్యకుమార్ ఇండియాను ఒంటిచేత్తో గెలిపిస్తున్నాడు: గవాస్కర్
Gavaskar on Suryakumar: సూర్యకుమార్ ఇండియాను ఒంటిచేత్తో గెలిపిస్తున్నాడని అన్నాడు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఇండియా డిఫెండ్ చేసుకోగలిగినంత లక్ష్యాలను నిర్దేశించడంలో సూర్యదే కీలకపాత్ర అని అతడు అన్నాడు.
Gavaskar on Suryakumar: టాప్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో ఈ ఒక్క ఏడాదే వెయ్యికిపైగా పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న సూర్య.. తన అద్భుతమైన స్ట్రైక్‌రేట్, 360 డిగ్రీ ప్లేస్టైల్‌తో క్రికెట్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్ తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్ డివిలియర్స్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా సూర్యను ఆకాశానికెత్తారు.
తాజాగా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా సూర్య ఆడుతున్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. అతడు ఒంటిచేత్తో ఇండియాను గెలిపిస్తున్నాడని ప్రశంసించడం విశేషం. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఇండియా 170-180 స్కోర్లను అందుకోవడంలో సూర్యదే కీలకపాత్ర. కీలకమైన నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు దిగుతూ.. ఇండియా ఇన్నింగ్స్ వేగం పెంచడంలో అతడు సాయపడుతున్నాడు.
ఈ విషయంలోనే సూర్యపై ప్రశంసలు కురిపించాడు గవాస్కర్. "ఇండియా కాపాడుకోదగిన లక్ష్యాలు నిర్దేశించడంలో సూర్యనే కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఎంసీజీలో ఇండియా తన అత్యధిక స్కోరు సాధించింది. సూర్య 61 స్కోరు చేయకపోయి ఉంటే ఇండియా 150 కూడా దాటేది కాదు" అని ఇండియా టుడేతో గవాస్కర్ చెప్పాడు.
ఇక అతనికి ఉన్న మిస్టర్ 360 డిగ్రీ ట్యాగ్‌ను కూడా గవాస్కర్ సమర్థించాడు. "అతని ప్రతి ఇన్నింగ్స్ కచ్చితంగా 360 డిగ్రీస్‌వే. అతడు కొత్త మిస్టర్ 360 డిగ్రీ. వికెట్ కీపర్‌కు ఎడమవైపు అతడు కొట్టిన సిక్స్ అద్భుతం. చివరి ఓవర్లలో స్క్వేర్‌లెగ్‌వైపు ఎక్కువగా ఆడాడు. బౌలర్లు వేస్తున్న యాంగిల్‌ను అనుకూలంగా మార్చుకున్నాడు. ఎక్స్‌ట్రా కవర్ డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్ కూడా ఆడాడు. క్రికెట్ బుక్‌లోని ప్రతి షాట్ అతని దగ్గర ఉంది" అని గవాస్కర్ చెప్పాడు.
ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి తర్వాత అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా సూర్యకుమార్ నిలిచాడు. అతడు ఐదు మ్యాచ్‌లలో 225 రన్స్ చేశాడు. సగటు 75 కాగా.. స్ట్రైక్‌రేట్ ఏకంగా 193.96గా ఉంది.