Suryakumar on Sanju Samson: కేరళలో క్రికెటర్ సంజూ శాంసన్‌కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో తెలుసు కదా. అతడు నిలకడగా రాణిస్తున్నా.. ఇండియన్ టీమ్‌లో స్థానం దక్కడం లేదని వాళ్లు విమర్శిస్తూ ఉంటారు. అయితే సంజూ కూడా అప్పుడప్పుడూ తనకు దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.
తాజాగా శ్రీలంకతో సిరీస్‌లోనూ సంజూకి అవకాశం దక్కింది. అయితే ఊహించని గాయం అతన్ని సిరీస్‌కు దూరం చేసింది. అతనికి దక్కేదే చాలా తక్కువ అవకాశాలు. అది కూడా ఇలా గాయం కారణంగా చేజారడం సంజూ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో చివరి వన్డేను ఇండియన్ టీమ్ సంజూ సొంత రాష్ట్రం అయిన కేరళలోని త్రివేండ్రంలో ఆడింది.
దీంతో సహజంగానే స్టేడియమంతా సంజూ పేరుతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగానే బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను.. హమారా సంజూ కిదర్ హై (మా సంజూ ఎక్కడ) అంటూ స్టాండ్స్‌లోని కొందరు ప్రేక్షకులు అడిగారు. దీనికి సూర్య చెప్పిన సమాధానం వాళ్ల మనసులు గెలుచుకుంది. సంజూ మ గుండెల్లో ఉన్నాడంటూ అతడు సైగ చేశాడు.
దీంతో సంజూ ఫ్యాన్స్ ఆనందంతో గట్టిగా కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిజానికి సంజూ ఫిట్‌గా ఉండి ఉంటే వన్డే సిరీస్ మొత్తం ఆడేవాడు. నిజానికి సూర్యకు కూడా మూడో వన్డే మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో అతడు కేవలం 4 రన్స్ మాత్రమే చేశాడు. కానీ విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో ఇండియా ఏకంగా 5 వికెట్లకు 390 రన్స్ చేసింది.
ఆ తర్వాత శ్రీలంకను కేవలం 73 రన్స్‌కే ఆలౌట్ చేసి.. 317 రన్స్‌తో విజయం సాధించింది. వన్డేల్లో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను కూడా ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు బుధవారం (జనవరి 18) నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో ఇండియా ఆడనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌లో జరగనుంది.
సంబంధిత కథనం