Sourav Ganguly Security: గంగూలీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ.. ఇదీ కారణం
Sourav Ganguly Security: గంగూలీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఉన్న వీవీఐపీ సెక్యూరిటీ గడువు ముగియడంతో తాజాగా భద్రత మరింత పెంచారు.
Sourav Ganguly Security: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భద్రతను జెడ్ కేటగిరీకి పెంచింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని అక్కడ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఇన్నాళ్లూ అతనికి వై కేటగిరీ సెక్యూరిటీ ఉండేది. తాజాగా మంగళవారం (మే 16) ఈ సెక్యూరిటీని జెడ్ కేటగిరీకి పెంచాలని నిర్ణయించారు.
వీవీఐపీ గంగూలీ భద్రత గడువు ముగియడంతో ప్రొటోకాల్ లో భాగంగా రివ్యూ మీటింగ్ నిర్వహించామని, ఇందులో గంగూలీ భద్రతను జెడ్ కేటగిరీలోకి పెంచాలని నిర్ణయించినట్లు ఆ అధికారి తెలిపారు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కింద గంగూలీ వెనుక ఎప్పుడూ 8 నుంచి 10 మంది పోలీసు అధికారులు రక్షణగా ఉంటారు. ఇదే వై కేటగిరీ కింద గంగూలీకి ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు భద్రత కల్పించేవారు.
మంగళవారం కోల్‌కతాలోని గంగూలీ బెహాలా ఆఫీసులో ఈ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న విషయం తెలిసిందే. మే 21న అతడు కోల్‌కతాకు తిరిగి రానున్నాడని, అప్పటి నుంచే అతనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తామని ఆ అధికారి తెలిపారు. వెస్ట్ బెంగాల్లో పలువురు మంత్రులకు ఉండే సెక్యూరిటీ ఇక నుంచి గంగూలీకి కూడా ఉండనుండటం విశేషం.
అక్కడి సీఎంతోపాటు గవర్నర్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండగా.. పలువురు ఇతర మంత్రులకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. బుధవారం (మే 17) ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఆ టీమ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కు కీలకం కానుంది.
సంబంధిత కథనం