Manjrekar on Shubman gill: శుబ్‌మన్ గిల్ నుంచి ఇలాంటి ఇన్నింగ్సే ఆశిస్తున్నాం.. సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం
Manjrekar on Shubman gill: టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి నుంచి ఇలాంటి ఇన్నింగ్సే ఆశిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో అతడు సెంచరీతో అదరగొట్టాడు.
Manjrekar on Shubman gill: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో విజృంభించిన సంగతి తెలిసిందే. టెస్టు కెరీర్‌లో రెండో శతకం నమోదు చేసిన ఈ ప్లేయర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడు విరాట్ కోహ్లీ కూడా అర్ధశతకంతో రాణించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ముఖ్యంగా శనివారం నాటి ఆటలో హైలెట్ అంటే శుబ్‌మన్ గిల్ సెంచరీనే. అతడు తన అద్భుత ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. తాజాగా గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్. అతడి నుంచి ఇలాంటి ఆటే ఆశించామని స్పష్టం చేశారు.
గిల్ అంచనాలను మించలేదు. అతడి నుంచి ఇలాంటి ఇన్నింగ్సే ఊహించాం. కానీ భారత్‌లో అభిమానుల అంచనాలను అందుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వారి అంచనాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి, కేఎల్ రాహుల్‌కు కూడా విదేశాల్లో అద్భుతమైన రికార్డు ఉంది. శుబ్‌మన్ గిల్‌కు కూడా గొప్ప టెస్టు కెరీర్ ఉంది. బ్రిస్బేన్‌లో అతడు 90 సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌లో సెంచరీ సాధించాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం చాలా నిలకడైన ఆటతీరును కనబర్చాడు. కొంత ఒత్తిడి ఉన్న మాట నిజమే అయినప్పటికీ అతడు పరుగులు సాధించిన విధానం కమాండింగ్‌గా ఉంది. అని సంజయ్ మంజ్రేకర్ తెలిపారు.
60 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో గిల్ తన ఆటతీరును ప్రారంభించాడు. తర్వాత ఆది కొంచెం తగ్గింది. అయితే బ్యాటింగ్ అనుకూలిస్తున్న తరుణంలో బౌలర్లను అస్సలు వదలలేదు. అతడు అవుట్ అయినప్పుడు మాత్రం కాస్త నిరాశకు గురయ్యాడు. గిల్ సుదీర్ఘమైన టెస్టు కెరీర్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నాము.
ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 235 బంతుల్లో 128 పరుగులతో ఆకట్టుకోగా.. కోహ్లీ 59 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగుల లక్ష్యాన్ని అధిగమించేందుకు మరో 191 పరుగుల దూరంలో టీమిండియా ఉంది.