India vs Australia: శుబ్‌మన్ గిల్ ఇంకా మెరుగవ్వాలి.. అవకాశాలను ఉపయోగించుకోవాలి.. పాక్ మాజీ స్పష్టం
India vs Australia: టీమిండియా క్రికెటర్ శుబ్‌మన్ గిల్ టెస్టుల్లో ఇంకా మెరుగవ్వాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డ్యానిష్ కనేరియా స్పష్టం చేశాడు. అతడు తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నాడు.
India vs Australia: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఓటమిని మూటగట్టుకుంది. ముఖ్యంగా భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్‌ను సమర్పించుకోవాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్‌ను కాదని శుబ్‌మన్ గిల్‌కు అవకాశం మివ్వగా అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డ్యానిష్ కనేరియా.. గిల్ గురించి తన స్పందనను తెలియజేశాడు. అతడు ఇంకా బ్యాటింగ్‌లో మెరుగుపడాలని సూచించాడు.
"భారత్ బ్యాటర్లు క్రీజులో సెట్ అయ్యేందుకు ప్రయత్నించాలి. రోహిత్, కోహ్లీ, గిల్, శ్రేయాస్ భారీ స్కోర్లు చేయాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్‌ను ఇలాంటి పిచ్‌ల్లో జట్టులోకి తీసుకోవడాన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే అతడు స్వీప్, రివర్స్ స్వీప్‌లు ఆడగలడు. ఇది చాలా కీలకమైంది. ఇలాంటి ట్రాక్‌ల్లో జట్టులో ఎలాంటి మార్పులు చేయాలనేది ఆలోచించాలి." అని డ్యానిష్ కనేరియా అన్నాడు.
"ఇండోర్‌లో విఫలమైన శుబ్‌మన్ గిల్ చివరి టెస్టులోనైనా సత్తా చాటాల్సి ఉంది. లేకుంటే అతడిపై వేటుపడే అవకాశముంది. అంతేకాకుండా అతడు ర్యాష్ షాట్లు ఆడాడు. ఫలితంగా కోచ్ ద్రవిడ్‌ను కూడా అసంతృప్తికి గురిచేసింది. జట్టులో స్థానం దక్కకపోవడం కేఎల్ రాహుల్ దురదృష్టకరమే. కాబట్టి తన స్థానం కాపాడుకోవాలంటే గిల్ మరింత మెరుగుపడాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి." అని కనేరియా తెలిపాడు.
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో రోజు ఉదయమే మ్యాచ్ ముగిసింది. మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు విపరీతంగా అనుకూలించింది. తొలి రోజు ఆరంభం నుంచే పిచ్‌పై స్పిన్నర్లు విజృంభించారు. ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. మార్చి 9 నుంచి ఆఖరుదైన నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది.