Salman Butt on Shubman Gill: ఫెదరర్‌లాగే ఆడుతున్నాడు.. శుభ్‌మన్ గిల్‌ను ఆకాశానికెత్తిన పాక్ మాజీ కెప్టెన్
Salman Butt on Shubman Gill: ఫెదరర్‌లాగే ఆడుతున్నాడంటూ శుభ్‌మన్ గిల్‌ను ఆకాశానికెత్తాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Salman Butt on Shubman Gill: వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయసు ప్లేయర్ గా శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించిన సంగతి తెలుసు కదా. హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో గిల్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. 149 బంతుల్లో 208 రన్స్ చేసిన గిల్.. వన్డేల్లో ఇండియా తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు అందుకున్న బ్యాటర్ గానూ నిలిచాడు.
దీంతో ఈ యువ బ్యాట్స్ మన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అయితే.. టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ తో గిల్ ను పోల్చడం విశేషం. టెన్నిస్ కోర్టులో ఫెడెక్స్ తన అద్భుతమైన క్వాలిటీ, టచ్ తో ఎలా అయితే షాట్స్ ఆడతాడో గిల్ కూడా అలాగే ఆడుతున్నాడని భట్ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ సల్మాన్ ఈ కామెంట్స్ చేశాడు.
"గిల్ కు నేను చాలా రోజులుగా అభిమానిని. న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో అతడు ఆడిన తీరు చూసిన గిల్ కు అభిమానిగా మారిపోయాను. అతని షాట్లలోని సొగసు, టైమింగ్ నాకు చాలా నచ్చాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అతనిలాంటి టచ్ ఉన్న ప్లేయర్స్ ఎక్కువ మంది ఉండరు. ఇప్పుడంతా పవర్ హిట్టర్ల గురించే మాట్లాడుకుంటున్నారు" అని సల్మాన్ అన్నాడు.
"గిల్ పూర్తిగా భిన్నమైన క్రికెట్ ఆడుతున్నాడు. అచ్చూ రోజర్ ఫెదరర్ లాగా అనిపిస్తోంది. అతడు కూడా అద్భుతమైన క్వాలిటీ, టచ్ తో తన షాట్లు ఆడతాడు. ఇంత తక్కువ వయసులో గిల్ లాగా తన గేమ్ లోని సొగసు చూపించడం చాలా అరుదు. గిల్ అరుదుగా దొరికే ప్లేయర్. అతని టచ్ షాట్లు అనే కాదు కానీ.. ఓవైపు ఇతర బ్యాటర్లంతా పెవిలియన్ కు క్యూ కడుతున్నా గిల్ మాత్రం భారీ స్కోర్లు చేయడం కూడా అద్బుతం. షాట్ల ఎంపిక, ఏ బౌలర్ ను లక్ష్యంగా చేసుకోవాలన్నదానిపై గిల్ కు స్పష్టత ఉంది. ఈ విషయంలో అతడు గొప్ప పురోగతి సాధించాడు" అని సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు.
న్యూజిలాండ్ పై అతడు డబుల్ సెంచరీ చేసినా.. ఇండియా మాత్రం కాస్తా కష్టంగానే తొలి వన్డే గెలిచింది. ఇక ఇప్పుడు శనివారం (జనవరి 21) రాయ్‌పూర్ లో జరగబోయే రెండో వన్డేకు ఇండియన్ టీమ్ సిద్ధమవుతోంది.
సంబంధిత కథనం
టాపిక్