Rohit Sharma Record: ధోనీ, బాబర్ ఆజం రికార్డు సమం చేసిన రోహిత్ శర్మ-rohit sharma record with second win in a row over australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma Record: ధోనీ, బాబర్ ఆజం రికార్డు సమం చేసిన రోహిత్ శర్మ

Rohit Sharma Record: ధోనీ, బాబర్ ఆజం రికార్డు సమం చేసిన రోహిత్ శర్మ

Hari Prasad S HT Telugu
Feb 20, 2023 06:18 PM IST

Rohit Sharma Record: ధోనీ, బాబర్ ఆజం రికార్డు సమం చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాపై రెండో టెస్ట్ విజయం తర్వాత రోహిత్ ఈ ఇద్దరి సరసన నిలిచాడు.

జడేజా, రోహిత్ శర్మ
జడేజా, రోహిత్ శర్మ (AFP)

Rohit Sharma Record: విరాట్ కోహ్లి నుంచి టీమిండియా పగ్గాలు అందుకున్న తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ దూసుకెళ్తోంది. గతేడాది ఆసియాకప్, వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో విఫలమైనా.. ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రం టీమిండియాకు తిరుగు లేకుండాపోయింది. అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ మంచి విజయాలు సాధించింది.

తాజాగా ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తిరుగులేని 2-0 లీడ్ సాధించింది. ఇక సిరీస్ కోల్పోయే అవకాశం మాత్రం లేదు. ఢిల్లీలో ముగిసిన రెండో టెస్టు తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఇప్పటి వరకూ గత 50 ఏళ్లలో ఈ రికార్డు ఇద్దరి పేరిట మాత్రమే ఉంది. అందులో ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కాగా.. పాకిస్థాన్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజం.

ఇప్పుడీ ఇద్దరి సరసన రోహిత్ చేరాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. కెప్టెన్ గా తొలి నాలుగు టెస్టులలో విజయాలు సాధించడం. గతేడాది కోహ్లి నుంచి టెస్ట్ కెప్టెన్సీ అందుకున్న తర్వాత శ్రీలంకపై 2-0తో టీమిండియాను గెలిపించాడు రోహిత్ శర్మ. ఇక ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 2-0 ఆధిక్యం సంపాదించింది.

ధోనీ తొలిసారి 2008లో ఇండియా టీమ్ కు టెస్ట్ కెప్టెన్ అయిన సందర్భంలో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై రెండు టెస్టులు, ఇంగ్లండ్ పై మరో టెస్ట్ గెలిచింది. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా ఇదే రికార్డును రిపీట్ చేశాడు.

అతడు కెప్టెన్ అయిన తర్వాత సౌతాఫ్రికాపై పాకిస్థాన్ 2-0తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత బాబర్ కెప్టెన్సీలోనే జింబాబ్వేపై కూడా 2-0తో విజయం సాధించి సిరీస్ ఎగరేసుకుపోయింది. ఇప్పుడీ ఇద్దరి రికార్డును రోహిత్ సమం చేయడం విశేషం.

రోహిత్ శర్మ ఇప్పుడు ఆస్ట్రేలియాతో మార్చి 1 నుంచి జరగబోయే మూడో టెస్టులో కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. బ్యాట్స్‌మన్ గానూ ఈ నాలుగు టెస్టులలో రోహిత్ రాణించాడు. 45.5 సగటుతో 273 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కఠినమైన పరిస్థితులలోనూ రోహిత్ 120 రన్స్ చేసిన విషయం తెలిసిందే.

Whats_app_banner

సంబంధిత కథనం