Virat Kohli | కోహ్లీకి డుప్లెసిస్ మద్ధతు.. గొప్ప ఆటగాళ్లకు ఈ దశ తప్పదని వెల్లడి
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. సహచర ఆటగాడు విరాట్ కోహ్లీకి మద్ధతుగా నిలిచాడు. గొప్ప ఆటగాళ్లు ఈ దశను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. మంగళవారం నాడు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు.
టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీకి ఈ ఐపీఎల్ సీజన్ పీడకలలా మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా ప్రదర్శన చేసిందేమి లేదు. 9 మ్యాచ్‌ల్లో అతడు 16 సగటుతో కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేకాకుండా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. బ్యాటింగ్ స్థానాన్ని మారిస్తే ఏమైనా కుదురుకుంటాడనుకుంటే.. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చినప్పటికీ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో అభిమానులు తీవ్రంగా నిరాశకు గురవుతున్నారు. అయితే ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.
"గొప్ప ఆటగాళ్లు వీటన్నింటినీ ఎదుర్కోవాలి. ఈ దశను అధిగమించే వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. గేమ్ గురించి ఆలోచించకుండా నేరుగా ఆటతోనే తానేంటో అతడు(కోహ్లీ) నిరూపించుకోవాలని మేము కోరుకున్నాం. కోహ్లీ గొప్ప ఆటగాడు. మేము ఇప్పటికీ అతడికి మద్దతు ఇస్తున్నాం. అతడు పుంజుకుంటాడని ఆశిస్తున్నాం. ఇది ఆత్మవిశ్వాసంతో ఆడాల్సిన ఆట." అని డుప్లెసిస్ స్పష్టం చేశాడు. రాజస్థాన్‌తో పరాజయం గురించి స్పందించిన డుప్లెసిస్.. ఓ క్యాచ్ వదలడంతో పాటు 20 పరుగులు అదనంగా వారికి ఇచ్చి మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు. 140 పరుగులు ఆ పిచ్‌పై మెరుగైన స్కోరని అన్నాడు.
"ఆట ప్రాథమిక అంశాలు మారవు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చి అది నిర్ణయం సానుకూలంగా ఉంటుందో లేదో ప్రయత్నించాలి. ప్రయత్నించడమే ముఖ్యం. గత మ్యాచ్ తర్వాత మేము చర్చించుకున్నది ఇదే. అతడి నుంచి అత్యుత్తమ ఆట కోసం చూస్తున్నాం" అని డుప్లెసిస్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ అద్భుత అర్దశతకంతో రాజస్థాన్‌ను ఆదుకోవడంతో మెరుగైన స్కోరు సాధించిందీ జట్టు. ఆరంభం నుంచి పొదుపుగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్(2/19), వానిండు హసరంగా(2/23), మహ్మద్ సిరాజ్(2/30) ఆకట్టుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ 19.3 ఓవర్లలోనే 115 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి బెంగళూరు బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. వరుసగా పెవిలియన్ క్యూ కట్టడంతో రాజస్థాన్ విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో కుల్పీప్ సేన్ 4 వికెట్లతో విజృంభించగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రాజస్థాన్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ అంతకుముందు బ్యాటింగ్ లో స్కోరుకే పరిమితం కావాల్సిన జట్టును.. రియాన్ పరాగ్ అర్ధసెంచరీతో రాణించి ఒంటి చేత్తొ గెలిపించాడు.
సంబంధిత కథనం
టాపిక్