Ramiz Raza on India: బిలియన్‌ డాలర్‌ ఇండస్ట్రీ టీమ్‌ ఇలా..: ఇండియాను దారుణంగా ట్రోల్‌ చేసిన పాక్‌ బోర్డు ఛైర్మన్‌-ramiz raza on india says billion dollar industry team gone home ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ramiz Raza On India: బిలియన్‌ డాలర్‌ ఇండస్ట్రీ టీమ్‌ ఇలా..: ఇండియాను దారుణంగా ట్రోల్‌ చేసిన పాక్‌ బోర్డు ఛైర్మన్‌

Ramiz Raza on India: బిలియన్‌ డాలర్‌ ఇండస్ట్రీ టీమ్‌ ఇలా..: ఇండియాను దారుణంగా ట్రోల్‌ చేసిన పాక్‌ బోర్డు ఛైర్మన్‌

Hari Prasad S HT Telugu
Nov 11, 2022 04:07 PM IST

Ramiz Raza on India: బిలియన్‌ డాలర్‌ ఇండస్ట్రీ టీమ్‌ ఇలానా అంటూ ఇండియన్‌ టీమ్‌ను దారుణంగా ట్రోల్‌ చేశారు పాక్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా. అదే సమయంలో పాక్‌ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.

ఇండియన్ టీమ్ ను హేళన చేస్తూ మాట్లాడిన రమీజ్ రాజా
ఇండియన్ టీమ్ ను హేళన చేస్తూ మాట్లాడిన రమీజ్ రాజా

Ramiz Raza on India: టీ20 వరల్డ్‌కప్‌ 2022లో దాయాదులు ఇండియా, పాకిస్థాన్‌ల పరిస్థితి తారుమారైంది. మొదట్లో పాక్‌ టీమ్‌ అసలు సెమీస్‌ కూడా చేరుతుందో లేదో అన్న పరిస్థితి. ఇండియాతోపాటు జింబాబ్వే చేతుల్లోనూ ఓడి గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిదారి పడుతుందనుకున్నారు. అటు ఇండియా మాత్రం ఒక్క సౌతాఫ్రికాతో తప్ప మిగతా అన్ని మ్యాచ్‌లు గెలిచి సులువుగా సెమీస్‌ చేరింది. నెదర్లాండ్స్‌ చేతుల్లో సౌతాఫ్రికా ఓడటంతో పాకిస్థాన్‌కు లైన్‌ క్లియరైంది.

కానీ తొలి సెమీస్‌లో పాకిస్థాన్‌.. ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరింది. ఇటు ఇండియా పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ఇంగ్లండ్‌ చేతుల్లో ఘోరంగా ఓడి ఇంటిదారి పట్టింది. దీంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ అయిన రమీజ్‌ రాజా ఇండియన్‌ టీమ్‌, బీసీసీఐని హేళన చేస్తూ మాట్లాడారు.

పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు రమీజ్‌ మీడియాతో మాట్లాడారు. తమ టీమ్‌పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని, అదే సమయంలో బిలియన్‌ డాలర్‌ ఇండస్ట్రీ టీమ్‌ ఇంటికెళ్లిపోయిందని హేళన చేశారు.

"మా టీమ్‌పై మాకు అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి వరల్డ్‌ క్రికెట్‌ ఎంత వెనుకబడిపోయిందో పాకిస్థాన్‌ క్రికెట్‌ ఎంత ముందుకెళ్లిపోయిందో. ఈ వరల్డ్‌కప్‌లో అది తెలిపి వచ్చింది. బిలియన్‌ డాలర్‌ టీమ్స్‌ వెనుకబడిపోతే మా టీమ్‌ పైకెళ్లిపోయింది. అంటే కొన్ని విషయాలను మేము సరి చేస్తున్నామనే కదా అర్థం. గత నెలలోనే ముగ్గురు ప్లేయర్స్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా నిలిచారు" అని రమీజ్ అన్నారు.

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం (నవంబర్‌ 13) ఇంగ్లండ్‌తో పాకిస్థాన్‌ తలపడనుంది. ఈ మ్యాచ్ మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు మెల్‌బోర్న్‌లో 95 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే రెండు టీమ్స్‌ వరల్డ్‌కప్‌ పంచుకోవాల్సి ఉంటుంది.

Whats_app_banner