PSPK in Unstoppable: పవన్ కల్యాణా మజాకా.. కొత్త సర్వర్లు రెడీ చేసుకుంటున్న ఆహా.. ఇదీ కారణం!-pspk in unstoppable as the aha ott arranging additional servers to avoid crashes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pspk In Unstoppable: పవన్ కల్యాణా మజాకా.. కొత్త సర్వర్లు రెడీ చేసుకుంటున్న ఆహా.. ఇదీ కారణం!

PSPK in Unstoppable: పవన్ కల్యాణా మజాకా.. కొత్త సర్వర్లు రెడీ చేసుకుంటున్న ఆహా.. ఇదీ కారణం!

Hari Prasad S HT Telugu
Feb 01, 2023 09:59 PM IST

PSPK in Unstoppable: పవన్ కల్యాణా మజాకా? అతని అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ సిద్ధమవుతుంటే.. కొత్త సర్వర్లు రెడీ చేసుకుంంటోంది ఆహా ఓటీటీ. గతంలో ప్రభాస్ ఎపిసోడ్ తెచ్చిన తంటాలతో పాఠాలు నేర్చుకున్న ఈ ఓటీటీ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

బాలయ్యతో పవన్
బాలయ్యతో పవన్

PSPK in Unstoppable: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో ఈ మెగా హీరోకు ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే ఇతర హీరోకు లేరన్నా అతిశయోక్తి కాదు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఓ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై కనిపించబోతున్నాడంటే ఫ్యాన్స్ లో సహజంగానే ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది.

ఈ ఎపిసోడ్ కోసం లక్షల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందులోనూ అన్‌స్టాపబుల్ షోలో పవన్ ను ప్రశ్నలు అడగబోయేది నందమూరి బాలకృష్ణ కావడంతో ఈ ఆసక్తి సాధారణ అభిమానుల్లోనూ కనిపిస్తోంది. టాలీవుడ్ పై చెరగని ముద్ర వేసిన రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, రాజకీయ ప్రత్యర్థులు అయిన ఈ ఇద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు.

ఇప్పటికే దీని ట్రైలర్ ఈ ఎపిసోడ్ పై అంచనాలను భారీగా పెంచగా.. గురువారం (ఫిబ్రవరి 2) స్ట్రీమ్ కాబోతోంది. దీంతో ఆహా ఓటీటీ ఈ ఎపిసోడ్ కి ఉన్న క్రేజ్ ను ముందుగానే ఊహించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన తొలి మూడు గంటల్లోనే 20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో అంత భారీ ట్రాఫిక్ ను తట్టుకునేలా సర్వర్లను తీర్చిదిద్దుతున్నారు.

ఒకవేళ ఇంతకంటే ఎక్కువ మంది వచ్చినా సర్వర్లు క్రాష్ అవకుండా అదనపు సర్వర్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమ్ అయినప్పుడు కొంతసేపు ఆహా సర్వర్లు పనిచేయలేదు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆహా ముందుగానే సిద్ధమవుతోంది. సర్వర్లే కాదు.. ప్రత్యేకంగా ఓ టీమ్ ను కూడా రంగంలోకి దించనున్నారు.

ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ సమయంలో ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏదైనా సమస్యను ఎదుర్కొంటుందా అన్న విషయం పరిశీలించడమే ఈ టీమ్ బాధ్యత. ఆహా ఓటీటీ హడావిడి చూస్తుంటే.. పవన్ కల్యాణ్, బాలయ్య ఎపిసోడ్ గతంలోని అన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం