Balakrishna on Akkineni Controversy: వీర సింహా రెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఎంతటి వివాదానికి కారణమయ్యాయో మనం చూశాం. బాలయ్య తన మార్క్ ప్రసంగంలో భాగంగా ఓ ఫ్లోలో మాట్లాడుతూ.. అక్కినేని తొక్కినేని అని అనడం ఏఎన్ఆర్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఈ వివాదంపై ఏకంగా అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్ స్పందించారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి కళామతల్లి ముద్దు బిడ్డలను అవమానిస్తే తమను తాము అవమానించుకున్నట్లే అని వీళ్లు ట్వీట్లు చేశారు. అటు అభిమానులు కూడా బాలయ్య తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఈ వివాదంపై బాలకృష్ణ తాజాగా స్పందించాడు. గురువారం (జనవరి 26) తన నియోజకవర్గం హిందూపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అతడు.. ఈ వివాదంపై మీడియా ప్రశ్నించగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
మీరు అక్కినేని తొక్కినేని అనడం చాలా మందిని బాధించింది కదా.. దీనిపై ఏమంటారు అని మీడియా సభ్యులు అతన్ని అడిగారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ.. "అలాంటిదేమీ లేదు. నేను అక్కినేనిని బాబాయ్ అని పిలుస్తాను. తెలుగు సినిమాకు రెండు కళ్లు. ఒకటి నాన్నగారు అయితే మరొకరు అక్కినేని. ఆయన నుంచి పొగడ్తలకు దూరంగా ఉండాలన్నది నేర్చుకున్నాను. అక్కినేని బాబాయ్ ను అవమానించాలన్న ఉద్దేశం నాకు లేదు. అది పూర్తిగా ప్రేమతో చేసినవే. ఎన్టీఆర్ ను ఎన్టీవోడు అని ఎలా పిలుస్తారో అలాంటిదే ఇది కూడా" అని బాలయ్య చెప్పడం గమనార్హం.
తెలుగు సినిమా ఇండస్ట్రీని దశాబ్దాల పాటు ఏలిన అక్కినేని, నందమూరి కుటుంబాల మధ్య బాలయ్య చేసిన కామెంట్స్ చిచ్చు పెట్టాయి. దీనిపై నేరుగా అక్కినేని ఇంటి హీరోలే స్పందించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. మరి తాజాగా బాలయ్య ఇచ్చిన ఈ వివరణతో అయినా వివాదం సద్దుమణుగుతుందా లేదా చూడాలి.
సంబంధిత కథనం