Ponting warns Babar: స్మిత్, వార్నర్‌లను చూసి నేర్చుకో.. బాబర్ ఆజంకు పాంటింగ్ వార్నింగ్
Ponting warns Babar: స్మిత్, వార్నర్‌లను చూసి నేర్చుకో అంటూ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వార్నింగ్ ఇచ్చాడు. బాబర్ తన కెరీర్ లో ఇంకా అత్యున్నత స్థాయికి చేరుకోలేదని అన్నాడు.
Ponting warns Babar: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది అన్ని ఫార్మాట్లలోనూ టాప్ ఫామ్ లో ఉన్న అతడు.. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డును గెలుచుకున్నాడు. 2022లో బాబర్ మూడు ఫార్మాట్లలో కలిపి ఏకంగా 2600 రన్స్ చేశాడు.
ఇక వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును వరుసగా రెండేళ్లు గెలుచుకున్న రెండో ప్లేయర్ గా కూడా బాబర్ నిలిచాడు. అయితే ఇప్పటికీ బాబర్ ఆజం ఇంకా అంతర్జాతీయ క్రికెట్ లో తన అత్యుత్తమ ప్రదర్శన చేయలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంటున్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ల ఉదాహరణలు చెబుతూ బాబర్ ను హెచ్చరించాడు.
"అతడు ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్లలేదు. చాలా మంది బ్యాటర్లు వాళ్లు వయసు 30లకి దగ్గరరైనప్పుడు అత్యుత్తమంగా ఆడతారు. ఓ స్థాయికి చేరేందుకు మీ బ్యాటింగ్ ను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. స్టీవ్ స్మిత్, వార్నర్ లాంటి బ్యాటర్లు ఎక్కడ ఉన్నారో చూడండి. ఈ ఇద్దరితోపాటు కేన్ విలియమ్సన్ కూడా 30లకు చేరువైనప్పుడు అత్యుత్తమంగా ఆడారు" అని ఐసీసీతో పాంటింగ్ అన్నాడు.
బాబర్ ఆజంకు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉన్నదని కూడా చెప్పాడు. "బాబర్ ఇంకా మెరుగుపడాల్సింది ఉంది. నిజానికి గత మూడు, నాలుగేళ్లుగా అతడు ఆడుతున్న తీరు చూస్తుంటే ఇంకా మెరుగవడం అనేది కాస్త భయంగానే అనిపిస్తుంది. అతని ఆట చూడటానికి నేను ఇష్టపడతాను. కానీ అతడు ఇంకాస్త మెరుగవ్వాలి. అది జరుగుతుందని ఆశిస్తున్నాను" అని పాంటింగ్ అన్నాడు.
28 ఏళ్ల బాబర్ ఆజం మధ్యమధ్యలో తడబడుతున్నాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ లోనూ పరుగులు చేయలేకపోయాడు. పాకిస్థాన్ ఫైనల్ చేరినా.. బాబర్ మాత్రం టోర్నీ మొత్తంలో కేవలం 124 రన్స్ మాత్రమే చేయగలిగాడు.
సంబంధిత కథనం