Cummins On India Tour : ఇండియాకు గుడ్డిగా వెళ్లడం లేదు.. ఆస్ట్రేలియా కెప్టెన్ కామెంట్స్-pat cummins comments ahead of india tour says no one going there blind ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cummins On India Tour : ఇండియాకు గుడ్డిగా వెళ్లడం లేదు.. ఆస్ట్రేలియా కెప్టెన్ కామెంట్స్

Cummins On India Tour : ఇండియాకు గుడ్డిగా వెళ్లడం లేదు.. ఆస్ట్రేలియా కెప్టెన్ కామెంట్స్

Anand Sai HT Telugu
Jan 09, 2023 10:24 AM IST

IND Vs AUS : ఇండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు వెయిట్ చేస్తోంది. గుడ్డిగా అక్కడకు వెళ్లడం లేదని.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కామెంట్ చేశాడు.

ప్యాట్ కమిన్స్
ప్యాట్ కమిన్స్ (twitter)

నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత న్యూఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్‌లలో మ్యాచ్ లు జరుగుతాయి. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 2-0తో ఆసీస్ నెగ్గింది. ఆ తర్వాత ఇండియా మీద అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. భారత్‌లో మంచి టర్న్ ఉండే పిచ్‌లను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్‌(Pat Cummins) స్పందించాడు. తామేమీ గుడ్డిగా ఇండియాకు వెళ్లడం లేదని చెప్పాడు.

'ఈసారి ఇండియాలో టెస్టు సిరీస్(Test Series) గెలిచే అవకాశం మాకే ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికైతే కొత్త మార్పులకు చక్కగా అలవాటు పడుతున్నాం. గతేడాది పాకిస్థాన్, శ్రీలంక(Sri Lanka)తో ఆడిన అనుభవంతో ఆడేందుకు రెడీ అవుతున్నాం. అక్కడకు మేం గుడ్డిగా వెళ్లడం లేదు.. ఇప్పుడు ఉన్న ఖాళీ సమయంలో ఈ ఏడాది భవిష్యత్తుపై ఓ అంచనా వేసేందుకు ప్రయత్నిస్తాం. ఆ తర్వాత ఇండియాలో ఫ్రెష్ గా అడుగుపెడతాం.' ప్యాట్ కమిన్స్‌(Pat Cummins) చెప్పుకొచ్చాడు.

ఆసీస్ జట్టులో నాథన్ లియాన్ ప్రభావం చూపే స్పిన్నర్ గా ఉన్నాడు. ఆ జట్టు మరో స్పిన్నర్ కోసం వెతుకుతోంది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్ లతో టీమిండియా(Team India)కు సమస్యలు సృష్టించాలని ఆస్ట్రేలియా(Australia) అనుకుంటోంది. భారత్ వద్ద అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లు ఉన్నారు. వీరిని ఎదుర్కోవడంపై ఆసీస్ జట్టు ప్రణాళికలు వేస్తోంది.

వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ (WTC) ఫైన‌ల్ రేసులో టీమ్ ఇండియా కూడా ఉంది. ప్రస్తుతం డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో 75.36 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా 58.93 పాయింట్లతో ఇండియా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో పాటు ఫైన‌ల్ చేరుకునే మ‌రో జ‌ట్టు ఏద‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ రేసులో ఇండియా(India)కు ఎక్కువ‌గా అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో 58.93 పాయింట్లతో ఇండియా సెకండ్ ప్లేస్‌లో ఉండ‌గా 53.33 పాయింట్లతో శ్రీలంక మూడో స్థానంలో నిలిచింది. ఇండియా ఫైన‌ల్ చేరాలంటే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జ‌రగ‌నున్న బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీని క్లీన్ స్వీప్ చేయాలి.

Whats_app_banner