World Cup 2023: ప్రపంచకప్‍లో తలపడే పదో జట్టు ఇదే.. అద్భుత విజయంతో అర్హత-netherlands qualify for 2023 world cup after win against scotland in qualifiers ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  World Cup 2023: ప్రపంచకప్‍లో తలపడే పదో జట్టు ఇదే.. అద్భుత విజయంతో అర్హత

World Cup 2023: ప్రపంచకప్‍లో తలపడే పదో జట్టు ఇదే.. అద్భుత విజయంతో అర్హత

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 07, 2023 02:10 PM IST

World Cup 2023: వన్డే ప్రపంచకప్ టోర్నీకి నెదర్లాండ్స్ క్వాలిఫై అయింది. టోర్నీలో పదో జట్టుగా అడుగుపెట్టింది. క్వాలిఫయర్స్‌లో స్కాట్‍లాండ్‍పై అద్భుత విజయం సాధించింది నెదర్లాండ్స్.

నెదర్లాండ్స్ బ్యాట్స్‌మన్ లీడ్ (Photo: Twitter)
నెదర్లాండ్స్ బ్యాట్స్‌మన్ లీడ్ (Photo: Twitter)

World Cup 2023 - Netherlands : ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‍లో తలపడే పది జట్లు ఏవో తేలిపోయింది. ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ద్వారా రెండు జట్లు అర్హత సాధించాయి. పదో జట్టుగా నెదర్లాండ్స్.. ప్రపంచకప్‍లో స్థానం దక్కించుకుంది. ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌ సూపర్ సిక్స్‌లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‍లో స్కాట్‍లాండ్‍పై నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‍లో పదో జట్టుగా నెదర్లాండ్స్ అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్‍లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ప్రపంచకప్‍నకు అర్హత సాధించాలంటే ఈ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 44 ఓవర్లలోనే ఛేదించాల్సిన పరిస్థితి. అయితే, ఈ కష్టమైన పనిని అద్భుత సెంచరీతో సుసాధ్యం చేశాడు నెదర్లాండ్స్ బ్యాట్స్‌మన్ బాస్ డె లీడ్ (92 బంతుల్లో 123 పరుగులు; 7ఫోర్లు, 5 సిక్సర్లు). అతడి అద్భుత బ్యాటింగ్‍తో ఈ లక్ష్యాన్ని 42.5 ఓవర్లలోనే నెదర్లాండ్స్ ఛేదించింది. 2023 వన్డే ప్రపంచకప్‍నకు అర్హత సాధించింది. వివరాలు ఇవే.

ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో స్కాట్‍లాండ్ బ్యాటింగ్‍కు దిగింది. స్కాటిష్ స్టార్ బ్యాటర్ బ్రండన్ మెక్‍ములెన్ (110 బంతుల్లో 106 పరుగులు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (64), చివర్లో థామస్ మాక్‍ఇంతోష్ (38 నాటౌట్) రాణించారు. మొత్తంగా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది స్కాట్‍లాండ్. నెదర్లాండ్ బౌలర్లలో బాస్ డీ లీడ్ ఐదు వికెట్లతో మెరిశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‍లోనూ అతడే మెరుపులు మెరిపించాడు.

వన్డే ప్రపంచ కప్‍నకు పదో జట్టుగా అర్హత సాధిచాలంటే నెట్‍రన్ రేట్ మెరుగుదల కోసం 278 పరుగుల లక్ష్యాన్ని 44 ఓవర్లలోపే నెదర్లాండ్స్ ఛేదించాల్సి వచ్చింది. అయితే, దీన్ని సాధించింది నెదర్లాండ్స్. ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ (40) రాణించగా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో వచ్చిన బాస్ డె లీడ్ శకతంతో కదం తొక్కాడు. బౌండరీలతో చెలరేగాడు. దూకుడుగా ఆడి జట్టును విజయానికి చేరువ చేసి రనౌట్ అయ్యాడు. చివర్లో షాకీబ్ జుల్ఫికర్ (33) రాణించటంతో నెదర్లాండ్స్ అద్భుత విజయం సాధించింది. 42.5 ఓవర్లలోనే ఆరు వికెట్లకు 278 పరుగులకు చేరుకొని నెదర్లాండ్ చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. 2023 ప్రపంచకప్‍లో పదో జట్టుగా చోటు సంపాదించింది. రెండో క్వాలిఫయర్‌గా అడుగుపెట్టింది.

కాగా, ఈ క్వాలిఫయర్స్ ద్వారానే శ్రీలంక.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది.

ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచకప్ టోర్నీకి భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ర్యాంకింగ్‍ల పరంగా నేరుగా అర్హత సాధించాయి. కాగా, క్వాలిఫయర్స్ ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ టీమ్‍లు క్వాలిఫై అయ్యాయి. ఈ పది జట్లు.. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‍లో తలపడనున్నాయి.

2011 తర్వాత వన్డే ప్రపంచకప్‍నకు నెదర్లాండ్స్ అర్హత సాధించడం ఇదే తొలిసారి. అంతకు ముందు 1996, 2003, 2007 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ ఆడింది ఈ టీమ్. ఇప్పుడు ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నీకి క్వాలిఫై అయింది.

Whats_app_banner