Mithali Raj to play Women's IPL: రిటైర్మెంట్ నుంచి బయటకు రానున్న మిథాలీ.. వుమెన్స్ ఐపీఎల్ కోసమే..
Mithali Raj to play Women's IPL: రిటైర్మెంట్ నుంచి బయటకు రానుంది మిథాలీ రాజ్. మార్చిలో జరగనున్న వుమెన్స్ ఐపీఎల్ కోసం ఆమె రిటైర్మెంట్‌ను పక్కన పెట్టి వచ్చే అవకాశం ఉంది. అటు ఝులన్ గోస్వామి కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mithali Raj to play Women's IPL: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మళ్లీ క్రికెట్ ఫీల్డ్‌లో చూసే అవకాశం దక్కనుందా? మార్చి తొలి వారంలో జరుగుతుందని భావిస్తున్న మహిళల ఐపీఎల్‌లో ఆమె ఆడుతుందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. నిజానికి గతేడాది కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐపీఎల్ కోసం తాను రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చే ఆలోచన చేస్తానని మిథాలీ చెప్పింది.
ఇక ఇప్పుడు తొలిసారి జరగబోయే ఈ మెగా లీగ్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో అందరి కళ్లూ మిథాలీ వైపే ఉన్నాయి. ఒకవేళ ఆమె నిజంగానే రిటైర్మెంట్‌ను పక్కన పెట్టి మళ్లీ ఈ లీగ్‌లో ఆడితే.. అది వుమెన్స్ ఐపీఎల్‌కు బూస్ట్‌లాగా పని చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ లీగ్‌లో ఐదు టీమ్స్ పాల్గొంటున్నాయి. వాటి పేర్లను ఈ నెల చివర్లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
గతేడాది ఐసీసీ 100% క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఇషా గుహ, న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ ఫ్రాంకీ మెక్‌కేతో మాట్లాడుతూ.. మిథాలీ తన రిటైర్మెంట్‌పై స్పందించింది. "నేను ఆప్షన్‌ను పరిశీలిస్తాను. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వుమెన్స్ ఐపీఎల్‌కు మరిన్ని నెలల సమయం ఉంది. వుమెన్స్ ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో పాల్గొనడం చాలా బాగుంటుంది" అని మిథాలీ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.
40 ఏళ్ల మిథాలీ ఇండియా తరఫున 89 టీ20లు ఆడింది. 37 సగటుతో 2364 రన్స్ చేసింది. 2019లో చివరిసారి ఇంగ్లండ్‌తో ఆమె టీ20 మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత గతేడాది జూర్ వరకూ టెస్టులు, వన్డేల్లో కొనసాగింది. తర్వాతి రిటైర్మెంట్ ప్రకటించింది.
ఇక మరోవైపు మిథాలీలాగే పేస్‌బౌలర్ ఝులన్ గోస్వామి కూడా ఐపీఎల్ కోసం రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఝులన్ కూడా రెండు దశాబ్దాల పాటు ఇండియన్ క్రికెట్‌కు సేవలందించి గతేడాది ఇంగ్లండ్ టూర్‌లో రిటైరైంది.
ఆమె రిటైర్మెంట్ సమయానికి మహిళల ఐపీఎల్‌ను అధికారికంగా ప్రకటించకపోవడంతో తాను దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఝులన్ చెప్పింది. అయితే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పడంతో ఝులన్ కూడా రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంబంధిత కథనం