Women IPL 2023: వుమెన్స్ ఐపీఎల్.. టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ.. బేస్‌ప్రైస్ రూ.400 కోట్లు!
Women IPL 2023: వుమెన్స్ ఐపీఎల్ కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించింది. ఈ లీగ్‌లో ఒక్కో ఫ్రాంఛైజీ కోసం బేస్‌ప్రైస్‌ను రూ.400 కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Women IPL 2023: ఈ ఏడాది నుంచి వుమెన్స్ ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం ఫ్రాంఛైజీలను ఓన్ చేసుకోవడానికి బోర్డు టెండర్లు ఆహ్వానించింది. టెండర్ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేయడానికి చివరి తేదీని జనవరి 21గా నిర్ణయించారు. ఈ మహిళల ఐపీఎల్ కోసం గత నెలలోనే బీసీసీఐ మీడియా హక్కుల టెండర్లను కూడా ఆహ్వానించింది.
రూ.5 లక్షల నాన్ రీఫండబుల్ మొత్తాన్ని చెల్లించి ఈ టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. ఇక ఈ టీమ్స్‌లో ఒక్కో ఫ్రాంఛైజీ కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు ఒక్కో ఫ్రాంఛైజీ నుంచి కనీసం రూ.వెయ్యి కోట్లు రాబట్టాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఒక్కో టీమ్ ప్లేయర్స్‌ను కొనుగోలు చేయడానికి గరిష్ఠ పరిమితి కూడా రూ.35-40 కోట్ల వరకూ ఉండొచ్చు.
ఇప్పటికే వుమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. డిస్నీ హాట్‌స్టార్, సోనీ నెట్‌వర్క్, వయాకామ్18లాంటి వాటితోపాటు మొత్తం 10 సంస్థలు మీడియా హక్కుల టెండర్లు దాఖలు చేశాయి. జనవరి 12లోపు ఈ సంస్థలు బిడ్స్ దాఖలు చేయాల్సి ఉంది. మీడియా హక్కుల అమ్మకం తర్వాత వుమెన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీలను అమ్మనుంది.
తొలి మహిళల ఐపీఎల్ మార్చి 3 నుంచి 26 మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మెన్స్ ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీలు కలిగి ఉన్న ఓనర్లను వుమెన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీల బిడ్లలోనూ పాలుపంచుకోవాల్సిందిగా బీసీసీఐ కోరింది. అయితే వాళ్లతోపాటు బోర్డు కనీసం అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న ఎవరైనా టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది.
టెండర్ ప్రక్రియలో పాల్గొన్నంత మాత్రాన ఇప్పటికే పురుషుల ఫ్రాంఛైజీ కలిగి ఉన్న వారికి కచ్చితంగా మహిళల ఫ్రాంఛైజీ దక్కుతుందన్న హామీ ఇవ్వడం లేదని కూడా ఈ సందర్బంగా బోర్డు తేల్చి చెప్పింది. తొలి మహిళల ఐపీఎల్‌లో ఐదు టీమ్స్ ఉండనున్నాయి. వీళ్ల మధ్య 22 మ్యాచ్‌లు జరుగుతాయి. గరిష్ఠంగా ఒక్కో టీమ్‌లో 18 ప్లేయర్స్ ఉండవచ్చు. అందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్ ఉంటారు. టీమ్ స్టేజ్‌లోనే ఒక్కో టీమ్ ప్రతి టీమ్‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. టేబుల్లో టాప్ 2లో నిలిచిన టీమ్స్ నేరుగా ఫైనల్ చేరతాయి.