Women's IPL Franchise Base price: మహిళల ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ బేస్‌ ప్రైస్‌ రూ.400 కోట్లు-womens ipl franchise base price will be 400 crores ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Women's Ipl Franchise Base Price: మహిళల ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ బేస్‌ ప్రైస్‌ రూ.400 కోట్లు

Women's IPL Franchise Base price: మహిళల ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ బేస్‌ ప్రైస్‌ రూ.400 కోట్లు

Hari Prasad S HT Telugu
Nov 29, 2022 04:45 PM IST

Women's IPL Franchise Base price: మహిళల ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ బేస్‌ ప్రైస్‌ను రూ.400 కోట్లుగా నిర్ణయించింది బీసీసీఐ. 2023 మార్చి నుంచి ఐదు టీమ్స్‌తో మహిళల ఐపీఎల్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది నుంచి జరగనున్న వుమెన్స్ ఐపీఎల్
వచ్చే ఏడాది నుంచి జరగనున్న వుమెన్స్ ఐపీఎల్ (Twitter)

Women's IPL Franchise Base price: ఐపీఎల్‌ మరో లెవల్‌కు చేరనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ మెగా లీగ్‌ మహిళల కోసం కూడా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐదు టీమ్స్‌తో తొలి మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ ఐదు ఫ్రాంఛైజీలను త్వరలోనే బీసీసీఐ వేలం నిర్వహించనుంది.

దీనికోసం కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించారు. 2008లో తొలి ఐపీఎల్‌ జరిగినప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ధర రూ. 446 కోట్లను ఆధారంగా చేసుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ఆసక్తిపై కాస్త అధ్యయనం చేసిన బీసీసీఐ కనీస ధరను నిర్ణయించినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.

ఇక ఒక్కో ఫ్రాంఛైజీ రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది. టెండర్‌ డాక్యుమెంట్‌ ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే కచ్చితంగా ఓ ఫ్రాంఛైజీకి ఎంతొస్తుందన్నదానిపై ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. వేలంలో బిడ్ గెలిచిన ఫ్రాంఛైజీ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలను అమ్మడం ద్వారా బీసీసీఐ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకూ రాబట్టాలని చూస్తోంది. ప్రస్తుతం మెన్స్‌ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఓనర్లకు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం బీసీసీఐ ఇచ్చింది. ఈ విషయంలో ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌, అమెరికాలో వుమెన్స్‌ ఎన్‌బీఏలను పరిగణనలోకి తీసుకుంటోంది.

ఈపీఎల్‌ మహిళల కోసం వుమెన్స్ సూపర్‌ లీగ్ ప్రారంభించగా.. అందులో మొత్తం 12 ఈపీఎల్ క్లబ్‌ ఓనర్లే ఈ టీమ్స్‌ను కొనుగోలు చేశారు. ఇక అమెరికాలో వుమెన్స్‌ ఎన్‌బీఏలో మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలకుగాను నాలుగు పురుషుల టీమ్స్ ఓనర్లే కొనుగోలు చేయగా.. మరో నాలుగు ఇతరులు చేశారు.

Whats_app_banner

టాపిక్