Marnus Labuschagne Record: ఆల్‌ టైమ్‌ హయ్యెస్ట్‌ రేటింగ్ పాయింట్స్‌.. కోహ్లిని సమం చేసిన లబుషేన్‌-marnus labuschagne record as he equals virat kohlis highest rating points in test rankings ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Marnus Labuschagne Record: ఆల్‌ టైమ్‌ హయ్యెస్ట్‌ రేటింగ్ పాయింట్స్‌.. కోహ్లిని సమం చేసిన లబుషేన్‌

Marnus Labuschagne Record: ఆల్‌ టైమ్‌ హయ్యెస్ట్‌ రేటింగ్ పాయింట్స్‌.. కోహ్లిని సమం చేసిన లబుషేన్‌

Hari Prasad S HT Telugu
Dec 14, 2022 02:29 PM IST

Marnus Labuschagne Record: తన ఆల్‌ టైమ్‌ హయ్యెస్ట్‌ రేటింగ్ పాయింట్స్‌ సాధించాడు ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని సమం చేశాడు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లి రేటింగ్ పాయింట్ల రికార్డును సమం చేసిన లబుషేన్
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లి రేటింగ్ పాయింట్ల రికార్డును సమం చేసిన లబుషేన్ (AFP)

Marnus Labuschagne Record: ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ టెస్టుల్లో తన అద్భుతమైన ఆటతీరును కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన లబుషేన్‌.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన ఆల్‌ టైమ్‌ హయ్యెస్ట్‌ రేటింగ్ పాయింట్లను సాధించాడు. 937 పాయింట్ల మార్క్‌ను లబుషేన్ అందుకున్నాడు.

ఇంతకుముందు 2018లో కోహ్లి కూడా సరిగ్గా 937 పాయింట్లు సాధించాడు. ఇప్పుడా రికార్డును లబుషేన్‌ సమం చేశాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో లబుషేన్‌ రెండు సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ చేయడం విశేషం. ఈ సిరీస్‌లో అత్యధిక రన్‌ స్కోరర్‌ అతడే. ఈ రెండు మ్యాచ్‌లలో ఘనంగా గెలిచిన ఆస్ట్రేలియా.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది.

2019లో లార్డ్స్‌ టెస్ట్‌లో స్టీవ్ స్మిత్‌ స్థానంలో కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబుషేన్.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ ఇన్నింగ్స్‌లో 59 రన్స్‌ చేయడంతో ఆస్ట్రేలియా డ్రాతో గట్టెక్కింది. అక్కడి నుంచి లబుషేన్‌ వెనుదిరిగి చూడలేదు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీతో చెలరేగాడు.

ఆ తర్వాత రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 163 రన్స్‌ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో బ్రాడ్‌మన్‌ తర్వాత అత్యంత వేగంగా టెస్టుల్లో 3 వేల పరుగుల మైలురాయి అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. లబుషేన్‌ కేవలం 51 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డులతో లబుషేన్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన గత రికార్డు అయిన 936 పాయింట్లను అధిగమించాడు.

అయితే ఓవరాల్‌గా హయ్యెస్ట్‌ రేటింగ్‌ పాయింట్స్‌ సాధించిన స్టీవ్‌ స్మిత్‌ (947) కాస్త దూరంలో ఆగిపోయాడు. స్మిత్‌ 2017లో ఈ రికార్డు అందుకున్నాడు. ఈ నెల 17 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగబోయే మూడు టెస్ట్‌ల సిరీస్‌లో లబుషేన్‌ ఎలా రాణిస్తాడో చూడాలి.

Whats_app_banner