Kapil Dev on Team India: ఇండియన్ ప్లేయర్స్‌ను ఇక చోకర్స్ అని పిలవొచ్చు: కపిల్ దేవ్
Kapil Dev on Team India: ఇండియన్ ప్లేయర్స్‌ను ఇక చోకర్స్ అని పిలవొచ్చంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. పెద్ద టోర్నీల్లో చివరి వరకూ వచ్చి బోల్తా కొట్టడం అలవాటు మార్చుకుంది టీమిండియా.
Kapil Dev on Team India: టీ20 వరల్డ్‌కప్ నుంచి ఇండియా సెమీస్‌లో ఎలిమినేట్ కావడాన్ని మాజీ క్రికెటర్లు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. టీమ్ వైఫల్యంపై చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. రోహిత్, కోహ్లిలాంటి వాళ్లు ఇక రిటైరయ్యే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఘాటుగానే స్పందించాడు. ఇండియన్ క్రికెటర్లను ఇక చోకర్స్ అని పిలవచ్చని అన్నాడు. 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకూ ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టుపై ఇండియా బోల్తా పడుతూ వస్తోంది. 2015 వన్డే వరల్డ్‌కప్ సెమీస్, 2016 టీ20 వరల్డ్‌కప్ సెమీస్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్, తాజాగా 2022 టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇండియా ఓడిపోయింది.
అందుకే ఇండియన్ టీమ్‌పై చోకర్స్ అనే ముద్ర వేయడంలో పెద్ద తప్పేమీ లేదని కపిల్ అభిప్రాయపడటం విశేషం. అయితే ప్లేయర్స్‌ను మరీ అంత కఠినంగా విమర్శించాల్సిన అవసరం కూడా లేదని, గత కొన్నేళ్లుగా ఈ ప్లేయర్సే దేశానికి మంచి పేరు తెచ్చారని కూడా కపిల్ అన్నాడు.
"అవును వాళ్లను చోకర్స్ అని పిలవచ్చు. తప్పేమీ లేదు. చివరి వరకూ వచ్చి బోల్తా కొడుతున్నారు. కానీ మరీ అంత కఠినంగా ఉండకండి. ఇండియా చెత్తగా ఆడిందని నేనూ అంగీకరిస్తాను. కానీ ఒక్క మ్యాచ్‌తో మరీ అంతగా విమర్శించాల్సిన పని లేదు" అని కపిల్ స్పష్టం చేశాడు. మ్యాచ్ రోజుల ఇంగ్లండ్.. ఇండియా కంటే కండిషన్స్‌ను బాగా అంచనా వేసి గెలిచిందని కపిల్ అన్నాడు.
సూపర్ 12 స్టేజ్‌లో ఇండియా ఐదింట్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచినా కొందరు ప్లేయర్స్ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, మహ్మద్ షమి, దినేష్ కార్తీక్, పంత్, భువనేశ్వర్, అశ్విన్‌లాంటి ప్లేయర్స్ దారుణంగా విఫలమయ్యారు. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మాత్రమే ఫర్వాలేదనిపించారు.