Gavaskar on Team India: రోహిత్, కోహ్లి రిటైర్ కావచ్చు: ఇండియా ఓటమిపై గవాస్కర్
Gavaskar on Team India: చాలా మంది రిటైర్ కావచ్చు అంటూ టీమిండియా ఓటమిపై గవాస్కర్ చాలా తీవ్రంగా స్పందించాడు. రోహిత్ సేన దారుణ ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
Gavaskar on Team India: క్రికెట్‌లో గెలుపోటములు సహజమే. కానీ ఏమాత్రం పోరాటం లేకుండా చేతులెత్తేయడం మాత్రం దారుణం. అందులోనూ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఇంత చెత్తగా ఓడటాన్ని క్రికెట్ పండితులతోపాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎటు చూసినా ఇండియన్ టీమ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇండియన్ టీ20 టీమ్‌లో సమూల మార్పులు జరగవచ్చని అన్నాడు. అంతేకాదు కొన్ని రిటైర్మెంట్లు కూడా తప్పకపోవచ్చని అతడు స్పష్టం చేశాడు. సీనియర్ ప్లేయర్స్ రోహిత్, విరాట్ కోహ్లిలాంటి వాళ్లు రిటైర్ కావచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక నుంచి టీమ్‌లో హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించనున్నట్లు కూడా చెప్పాడు.
"న్యూజిలాండ్ టూర్‌కు అది పూర్తి భిన్నమైన టీమ్. అక్కడికి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమ్ వెళ్తోంది. అతడు టీమ్‌పై తన ముద్ర వేయబోతున్నాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా అతనికి సెలక్షన్ కమిటీ ఓ గురుతర బాధ్యత అప్పగించింది. టీ20ల్లో కెప్టెన్‌ను చేసింది. అందువల్ల పాండ్యా కెప్టెన్సీలో అది మొత్తంగా ఓ కొత్త టీమ్" అని గవాస్కర్ అన్నాడు.
"కొన్ని రిటైర్మెంట్లు తప్పకపోవచ్చు. దాని గురించి ఆలోచించే సమయం కాదు. ఈ సందర్భాన్ని మరచిపోవడానికి ప్రయత్నించవచ్చు. అయితే 30 ఏళ్లకుపైగా వయసున్న ప్లేయర్స్‌లో చాలా మంది ఇండియన్ టీ20 టీమ్‌లో తమ స్థానాలపై మరోసారి ఆలోచన చేయవచ్చు" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
గవాస్కర్ అన్నట్లు ఇక నుంచి హార్దిక్ కెప్టెన్సీలో ఓ కొత్త ఇండియన్ టీ20 టీమ్‌ను చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత మూడుసార్లు ఇండియన్ టీమ్ బాధ్యతలను పాండ్యాకు అప్పగించారు. అన్నిసార్లూ అతడు సక్సెస్ అయ్యాడు. ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌లు, ఆసియాకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లు పాండ్యా కెప్టెన్సీలో ఇండియా గెలిచింది.
ఇక ఇప్పుడు నవంబర్ 18 నుంచి హార్దిక్ కెప్టెన్సీలోనే ఇండియా న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఇంగ్లండ్ చేతుల్లో సెమీస్‌లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓడటంతో వరల్డ్‌కప్‌లో ఇండియా కథ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 168 రన్స్ చేయగా.. ఆ తర్వాత ఇంగ్లండ్ కేవలం 16 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా చేజ్ చేసేసింది.