Jasprit Bumrah Ready: బుమ్రా ఫిట్.. ఆస్ట్రేలియాతో రెండో టీ20 ఆడనున్న పేసర్
Jasprit Bumrah Ready: జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లో అతడు ఆడనున్నాడు. ఇది టీమ్‌కు బూస్ట్‌లా పనిచేయనుందనడంలో డౌట్ లేదు.
Jasprit Bumrah Ready: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఓడిన టీమిండియాకు మొత్తానికి ఓ గుడ్‌న్యూస్. ఆసియా కప్‌తోపాటు తొలి టీ20 మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో టీ20కి తిరిగి టీమ్‌లోకి రానున్నాడు. ఆసియా కప్ తర్వాత గాయం నుంచి కోలుకున్న బుమ్రాను ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేశారు.
అయితే వరల్డ్‌కప్‌కు ముందు రిస్క్ తీసుకోకూడదనుకున్న సెలక్టర్లు.. తొలి టీ20లో అతన్ని ఆడించలేదు. నిజానికి అంతకుముందే నెట్స్‌లో బుమ్రా పూర్తిస్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడు ఫిట్‌గా ఉన్నా కూడా మరికొంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ తుది జట్టులోకి తీసుకోలేదు. అతని స్థానంలో తొలి టీ20లో ఉమేష్ యాదవ్ ఆడాడు.
అయితే డెత్ ఓవర్లలో వరుసగా విఫలమవుతున్న భారత బౌలింగ్ విభాగానికి బుమ్రా రాక బూస్ట్‌లా పని చేయనుంది. ఆసియాకప్‌తోపాటు ఆస్ట్రేలియాతో తొలి టీ20లోనూ డెత్ ఓవర్లలో బౌలర్ల వైఫల్యం టీమ్ కొంప ముంచింది. ఏదో చేస్తారనుకున్న స్టార్ బౌలర్లు భువనేశ్వర్, హర్షల్ పటేల్ తొలి మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసి ఏకంగా 101 రన్స్ సమర్పించుకున్నారు.
అయితే డెత్ ఓవర్లనే కాదు.. మ్యాచ్‌లో ఏ పరిస్థితుల్లో అయినా బౌలింగ్ చేయగల సత్తా ఉన్న బుమ్రా తుది జట్టులోకి తిరిగొస్తే అది ఇతర బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. తొలి మ్యాచ్‌లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించిందని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనడం చూస్తే.. టీమ్ అతనిపై ఎంతగా ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చు.
సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో రెండో టీ20లో బుమ్రాను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయం. ఉమేష్ యాదవ్ స్థానంలో బుమ్రా టీమ్‌లోకి రానున్నాడు. నిజానికి తొలి మ్యాచ్‌లో ఉమేషే రెండు వికెట్లతో కాస్త ఫర్వాలేదనిపించాడు. కానీ టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో లేని అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం కుదరదు. అతన్ని కేవలం కొవిడ్ బారిన పడిన షమికి బ్యాకప్‌గా మాత్రమే తీసుకున్నారు.