Hardik Pandya on Bumrah: బుమ్రా లేని లోటు కనిపిస్తోంది.. హార్దిక్-hardik pandya says without jasprit bumrah there is a big difference ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Hardik Pandya Says Without Jasprit Bumrah There Is A Big Difference

Hardik Pandya on Bumrah: బుమ్రా లేని లోటు కనిపిస్తోంది.. హార్దిక్

Maragani Govardhan HT Telugu
Sep 21, 2022 12:03 PM IST

Hardik about Jasprit Bumrah: జట్టులో బుమ్రా లేకపోవడం పెద్ద మార్పును కలిగిస్తుందని టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. అతడి లేని లోటు కనిపిస్తుందని స్పష్టం చేశాడు. మంగళవారం నాడు టీమిండియాతో జరిగిన తొలి టీ20 ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే.

హార్దిక్ ఫాండ్య
హార్దిక్ ఫాండ్య (ANI)

Hardik Pandya About Bumrah not Being in Team: టీ20 ప్రపంచకప్ ముంగిట పరాజయాలు పాలవ్వడం టీమిండియాకు పరిపాటయింది. పాకిస్థాన్, శ్రీలంక.. తాజాగా ఆస్ట్రేలియా వరుసగా పెద్ద జట్లతో ఓటములను చవిచూస్తూ.. భారత అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్‌లో టీమిండియా తేలిపోతుంది. బుధవారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బౌలర్లు విఫలం కావడంతో విజయాన్ని సమర్పించుకోవాల్సి వచ్చింది. బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. బౌలర్లు తేలిపోవడంతో మ్యాచ్ ఫలితం తారుమారైంది. సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇదే విషయాన్ని టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కూడా స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

“జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం జట్టులో పెద్ద మార్పును కలిగిస్తుంది. అతడు గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేస్తున్నాడు. అయితే తిరిగి రావడానికి తగినంత సమయం పొందడం చాలా ముఖ్యం. బహుశా తనపై ఎక్కువ ఒత్తిడి నెలకొనే అవకాశముంది. దేశంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా ఉన్న ప్రస్తుత జట్టుపై నమ్మకముంచాల్సిన అవసరముంది. కాకపోతే కొన్ని సమస్యలు ఉండవచ్చు." అని హార్దిక్ పాండ్య అన్నాడు.

బ్యాటింగ్‌లో దుమ్మురేపిన హార్దిక్ పాండ్య టీమిండియా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 30 బంతుల్లో 71 పరుగులతో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. తన ఈ పర్ఫార్మెన్స్‌పై పాండ్య ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

"ఇటీవల కాలంలో నేను చాలా విజయాలను పొందుతున్నాను. కానీ నా వరకు ఇలాంటి మంచి రోజుల్లో ఎలా మెరుగుపడగలను? అనేదే ముఖ్యం. నా కెరీర్ గ్రాఫ్ గురించి పెద్దగా చెప్పుకోను. నా ప్రదర్శనలో జయాపజయాలు ఉన్నాయి. ఈ సమయంలో నేను బాగా ఆడుతున్నాను. తర్వాతి మ్యాచ్‌లో నేనే వారికి టార్గెట్ కావచ్చు. కాబట్టి నేను వారికంటే ఓ అడుగు ముందుండాలి." అని పాండ్య స్పష్టం చేశాడు.

ఈ టీ20లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా ఆసీస్.. మూడు టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది. మొదట్లో కామెరాన్‌ గ్రీన్‌ (30 బాల్స్‌లో 61), చివర్లో మాథ్యూ వేడ్‌(21) 45) మెరుపులు మెరిపించి ఆస్ట్రేలియాకు కళ్లు చెదిరే విజయాన్ని అందించారు. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో కేవలం 17 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసినా.. మిగతా బౌలర్లు విఫలమవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.

స్టార్ బౌలర్లు భువనేశ్వర్, చహల్, హర్షల్ పటేల్ ఘోరంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(55), హార్దిక్ పాండ్య(71) అర్ధశతకాలతో చెలరేగగా సూర్యకుమార్ యాదవ్(71) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో బ్యాట్ ఝుళిపించాడు. ఫలితంగా భారత్ 208 పరుగుల భారీ స్కోరు సాధించింది.

WhatsApp channel

సంబంధిత కథనం