Irfan on Hardik Captaincy: హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై వార్నింగ్‌ ఇచ్చిన ఇర్ఫాన్‌ పఠాన్‌-irfan on hardik captaincy says need to concentrate on his fitness ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Irfan On Hardik Captaincy: హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై వార్నింగ్‌ ఇచ్చిన ఇర్ఫాన్‌ పఠాన్‌

Irfan on Hardik Captaincy: హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై వార్నింగ్‌ ఇచ్చిన ఇర్ఫాన్‌ పఠాన్‌

Hari Prasad S HT Telugu
Jan 02, 2023 01:59 PM IST

Irfan on Hardik Captaincy: హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రోహిత్ స్థానంలో పూర్తిగా అతనికి టీ20 కెప్టెన్సీ ఇచ్చే ముందు ఆలోచించుకోవాలని అనడం గమనార్హం.

హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా (ANI)

Irfan on Hardik Captaincy: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ టీ20 కెప్టెన్సీ పూర్తిగా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యాకు కట్టబెట్టాలన్న డిమాండ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా వైఫల్యం తర్వాత రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్‌ను కెప్టెన్‌ను చేయాలని ఫ్యాన్స్‌ కూడా డిమాండ్‌ చేస్తున్నారు. అందుకు తగినట్లే బీసీసీఐ కూడా అడుగులు వేస్తోంది.

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు హార్దిక్‌నే కెప్టెన్‌ను చేసింది. గతేడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటన్స్‌ను విజేతగా నిలిపిన తర్వాత హార్దిక్‌ కెప్టెన్సీపై చర్చ మొదలైంది. ఆ తర్వాత ఐర్లాండ్, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ టూర్లలో టీ20 కెప్టెన్సీ చేపట్టి సక్సెస్‌ సాధించాడు. దీంతో రోహిత్‌ను కేవలం వన్డేలు, టెస్టులకు పరిమితం చేసి టీ20 కెప్టెన్సీ హార్దిక్‌ ఇవ్వాలన్న ఆలోచన బీసీసీఐ కూడా చేస్తోంది.

మాజీ క్రికెటర్లు కూడా ఈ ఆలోచన బాగానే ఉందని అన్నారు. అయితే మాజీ పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వాదన మాత్రం మరోలా ఉంది. హార్దిక్‌ కెప్టెన్సీ బాగున్నా.. అతనికి దీర్ఘకాలిక కెప్టెన్సీ ఇచ్చే ముందు కాస్త ఆలోచించాలని అనడం గమనార్హం. ముఖ్యంగా హార్దిక్ ఫిట్‌నెస్‌ గురించి ఇర్ఫాన్‌ హెచ్చరిస్తున్నాడు.

"ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటన్స్‌కు అయినా, ఇండియన్‌ టీమ్‌కు అయినా హార్దిక్‌ చేపట్టి కెప్టెన్సీ బాగుంది. అతని కమ్యూనికేషన్‌ చాలా బాగుంది. అతడు చాలా చురుగ్గా కనిపించాడు. అతని కెప్టెన్సీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఫీల్డ్‌లో అతని తీరు నాకు చాలా బాగా అనిపించింది. అయితే సుదీర్ఘకాలం అతనికి కెప్టెన్సీ ఇవ్వాలని అనుకుంటే మాత్రం అతని ఫిట్‌నెస్‌పై చాలా దృష్టిసారించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఇదే కీలకం కానుంది" అని ఇర్ఫాన్‌ అన్నాడు.

వెన్నుముక గాయంతో చాలా కాలం ఇండియన్‌ టీమ్‌కు హార్దిక్‌ దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత టీమ్‌లోకి వచ్చినా బౌలింగ్‌ చేయలేకపోయాడు. అయితే గతేడాది ఐపీఎల్‌ నుంచి మరోసారి తన ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో మరోసారి అతని వెన్నునొప్పి తిరగబెట్టింది. దీంతో పాండ్యాపై పనిభారం తగ్గించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

WhatsApp channel