Trent Boult record: ఐపీఎల్లో బౌల్ట్ అరుదైన రికార్డు.. రాహుల్‌తో ఆటాడుకుంటున్న అభిమానులు
Trent Boult record: ఐపీఎల్లో బౌల్ట్ అరుదైన రికార్డు సెట్ చేశాడు. అదే సమయంలో రాహుల్‌తో ఆటాడుకుంటున్నారు అభిమానులు. ఇవి రెండూ వేర్వేరు వార్తల్లాగా కనిపించినా.. బౌల్ట్ రికార్డే రాహుల్ ట్రోలింగ్ కు కారణం కావడం విశేషం.
Trent Boult record: ఐపీఎల్ 2023లో మరో రికార్డు క్రియేటైంది. ఈ రికార్డు అందుకున్నది రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కాగా.. ఆ రికార్డు క్రియేట్ కావడానికి కారణమైంది మాత్రం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్. దీంతో అతన్ని నెటిజన్లు ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో రాహుల్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ బౌల్ట్ క్రియేట్ చేసిన రికార్డు ఏంటో తెలుసా? ఐపీఎల్లో అత్యధికసార్లు తొలి ఓవర్ మెయిడెన్ వేయడం. ఇప్పటి వరకూ బౌల్ట్ 8సార్లు ఇలా తొలి ఓవర్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ పేరిట ఇప్పటికే ఉన్న రికార్డును బౌల్ట్ సమం చేశాడు. ఆర్ఆర్, ఎల్‌ఎస్‌జీ మ్యాచ్ లో ఈ తొలి ఓవర్ ఆడింది కేఎల్ రాహుల్ కావడం విశేషం.
ఇప్పటికే స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్.. తాజాగా తొలి ఓవర్ నే మెయిడెన్ చేయడంతో అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. టీ20లు ఇలాగే ఆడాలని రాహుల్ డిసైడైనట్లు ఉన్నాడని వాళ్లు విమర్శిస్తున్నారు. అంతేకాదు 2014 నుంచి ఇప్పటి వరకూ ఐపీఎల్లో మొత్తం 27 సార్లు ఇలా తొలి ఓవర్ మెయిడెన్లు కాగా.. అందులో 11 సార్లు కేఎల్ రాహులే బ్యాటింగ్ చేస్తున్నట్లు ఓ చెత్త రికార్డును కూడా అభిమానులు బయటపెట్టారు.
ఈ మ్యాచ్ లో రాహుల్ 32 బంతుల్లో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో పవర్ ప్లేలో లక్నో ఓపెనర్లు ఇద్దరూ ధాటిగా ఆడలేకపోయారు. దీంతో లక్నో చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌల్ట్ 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
సంబంధిత కథనం