Fleming on Dhoni: ఎక్కువ కాలం ఆడలేడని ధోనీకి తెలుసు.. మహీ బ్యాటింగ్‌పై ఫ్లెమింగ్ షాకింగ్ కామెంట్స్-stephen fleming says ms dhoni knows he cannot bat for a long time ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fleming On Dhoni: ఎక్కువ కాలం ఆడలేడని ధోనీకి తెలుసు.. మహీ బ్యాటింగ్‌పై ఫ్లెమింగ్ షాకింగ్ కామెంట్స్

Fleming on Dhoni: ఎక్కువ కాలం ఆడలేడని ధోనీకి తెలుసు.. మహీ బ్యాటింగ్‌పై ఫ్లెమింగ్ షాకింగ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
May 11, 2023 01:10 PM IST

Fleming on Dhoni: చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌పై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ ఎక్కువ కాలం ఆడలేనని అతడికి తెలుసని, అందుకే డెత్ ఓవర్లలో హిట్టింగ్ చేసేలా శిక్షణ తీసుకున్నాడని తెలిపారు.

ఎంఎస్ ధోనీ
ఎంఎస్ ధోనీ (PTI)

Fleming on Dhoni: ఎంఎస్ ధోనీ నాలుగు పదుల వయసులోనూ అదిరిపోయే బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అతడు తన సిక్సర్లు కొట్టే నైపుణ్యుంతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు. బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‍‌లో ధోనీ 9 బంతుల్లో 20 పరుగులతో రాణించాడు. ఇందులో 2 సిక్సర్లు ఓ ఫోర్ కూడా ఉన్నాయి. 41 ఏళ్ల ధోనీ ఈ వయసులో 222.22 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతడి ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల వర్షంకురుస్తోంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా స్పందించారు. మహీ డెత్ ఓవర్లలో హిట్టింగ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేశాడని, మోకాలి గాయంతో బాధపడుతున్న అతడు చివరి మూడో ఓవర్లలో దృష్టిపెట్టాడని తెలిపారు.

"అతడు(ధోనీ) ఆ విధంగా ఆడటానికే శిక్షణ తీసుకున్నాడు. దీర్ఘకాలం పాటు ఆడలేనని అతడికి తెలుసు. కానీ బ్యాటింగ్ చేయాలి. అందుకే మహీ చివరి మూడు ఓవర్లలో బాగా ఆడేందుకు దృష్టి పెట్టాడు. ప్రస్తుతం అతడు వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తలేడు. కానీ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు" అని ఫ్లెమింగ్ తెలిపారు.

"భారీ హిట్టింగ్‌పై దృష్టి పెట్టినట్లు ఫ్లెమింగ్ చెప్పారు. ధోనీ ప్రస్తుతం భారీ హిట్టింగ్ చేయడంపైనే దృష్టిపెట్టాడు. ఫలితంగా ఆ ప్రయోజనాలను ఇప్పుడు చూస్తున్నాం. అరౌండ్ ది గ్రౌండ్ ఆడటానికి అతడు ఇష్టపడతాడు. అతడు బంతిని ఎంత బాగా హిట్ చేయగలడో మనకు తెలుసు. అలాగే కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ ఎంతో బలంగా ఆడుతున్నాడు. 20 ఓవర్ల క్రికెట్‌లో చివర్లో అతడు ఎంతో విలువైన ఆటగాడు." అని ఫ్లెమింగ్ తెలిపారు.

దిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో ధోనీ 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్ 2023 సీజన్‌లో 47 బంతులు ఎదుర్కొన్న అతడు 96 పరుగులు చేశాడు. అలాగే ప్రతి 4.7 బాల్స్‌కు ఓ సిక్సర్ కొట్టాడు. ఇదే సమయంలో ఇతర ఆటగాళ్లకు సగటున సిక్సర్ కొట్టేందుకు 40 బంతులు ఆడుతున్నారు. ధోనీ కంటే బెటర్ స్ట్రైక్ రేటు(204.25) ఎవరికీ లేదు.

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని దిల్లీ ఛేదించలేక 140 పరుగులకే పరిమితమైంది. దిల్లీ బ్యాటర్లలో రిలే రొసౌ(35), మనీష్ పాండే(27) మినహా మిగిలిన వారంతా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. వారు కూడా ఎక్కువ బంతులు వినియోగించడంతో చివరకు వచ్చేసరికి రన్ రేట్ పెరిగిపోయింది.

వేగంగా ఆడే క్రమంలో దిల్లీ బ్యాటర్లు క్రమంగా వికెట్లు కొల్పోయి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. చెన్నై బౌలర్లలో మహీష పతిరాణా 3 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ 2 వికెట్లతో రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 14 ఆదివారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.

Whats_app_banner